Thursday, September 19, 2024

Singareni | రాష్ట్ర విద్యుత్ అవసరాలకు సరిపడా బొగ్గును అందించాలి !

రాష్ట్రంలోని థర్మల్ పవర్ స్టేషన్లకు బొగ్గు కొరత లేకుండా బొగ్గును సరఫరా చేయాలని, ఇందుకోసం రోజుకు కనీసం రెండు లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి అంతే మొత్తంలో రవాణా చేయాలని సింగరేణి చైర్మన్, ఎండీ ఎన్.బలరాం అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లను ఆదేశించారు. ఈరోజు (శనివారం) ఆయన అన్ని ఏరియాల జీఎంలతో వీడియో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రతి ఏరియా ఉత్పత్తిని ఆయన సమీక్షించారు. భారీ వర్షాల కారణంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన నీటిని తక్షణమే తొలగించాలని, అవసరమైతే అదనపు పంపులను వినియోగించి బొగ్గు ఉత్పత్తిని పెంచాలని సూచించారు. రోజుకు కనీసం 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని కోరారు.

రాష్ట్ర విద్యుత్ అవసరాలకు సరిపడా బొగ్గును అందించాల్సిన బాధ్యత సింగరేణి కంపెనీపై ఉందని, ఉద్యోగులు, అధికారులు దీనిని దృష్టిలో ఉంచుకుని అంకితభావంతో పనిచేసి రక్షణతో ఉత్పత్తులు సాధించాలని పిలుపునిచ్చారు. గత మూడు నెలల్లో వర్షాల కారణంగా నష్టపోయిన ఉత్పత్తి నష్టాన్ని భర్తీ చేసేందుకు కృషి చేయాలన్నారు.

అలాగే కొత్తగూడెంలో వి.కె.ఓ.సి. మొదటి దశ అటవీ అనుమతులు లభించినందున, వచ్చే రెండు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఏరియాల్లో జనరల్ మేనేజర్లు సూచించిన వాటిపై ఆయన అప్పటికప్పుడు డైరెక్టర్లతో చర్చించి ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు డి.సత్యనారాయణరావు (ఈ అండ్ ఎం.), జి.వెంకటేశ్వర్ రెడ్డి (పిపి & పా), జనరల్ మేనేజర్ కో-ఆర్డినేషన్ ఎస్.డి.ఎం.సుభాని, జి.ఎం. (సి.పి.పి.) జక్కం రమేష్… వివిధ ఏరియాల జనరల్ మేనేజర్లు, వివిధ శాఖల కార్పోరేట్ జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement