తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి కుల సర్వేను వియవంతంగా పూర్తి చేస్తోంది. 12 రోజుల్లో ఈ సర్వే 65.02 శాతానికి చేరింది. 1,16,14,349 నివాసాల్లో సర్వే పూర్తి చేయాల్సి ఉండగా, 75,75,647 నివాసాల్లో పూర్తయింది. ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి సమగ్ర కుటుంబ సర్వే శరవేగంగా నిర్వహిస్తున్నప్పటికీ ప్రజల సహకారలేమి ఇబ్బందులకు గురి చేస్తోంది.
కాగా, జిల్లాల వారిగా సర్వేలో ములుగు జిల్లా 95.03 శాతం పూర్తి చేసుకొని ముందంజలో ఉంది. ఆ తర్వాత 89.1 శాతం పూర్తిచేసుకుని నల్గొండ రెండవ స్థానంలో ఉంది. తర్వాత వరుసగా జనగామ, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో కేవలం 44.3 శాతం సర్వే మాత్రమే పూర్తి చేసినట్టు అధికారులు వెల్లడించారు. జనసాంద్రత ఎక్కువగా ఉండటం వలన సిటీలో సర్వే నెమ్మదిగా సాగుతున్నట్టు తెలిపారు.