హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఐదవ విడత పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఐదవ విడత పల్లెప్రగతి గురించి ఆయన వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ నిర్వహించి పల్లెప్రగతి ప్రణాళిక తయారు చేసుకున్నట్లు తెలిపారు. గత 16 రోజుల కార్యక్రమంలో అన్ని రోడ్లు, మురికి నీటి కాలువలను శుభ్రం చేయడం జరిగిందన్నారు. 80వేల 545 ప్రభుత్వ, ప్రజోపయోగ కార్యాలయాలను శుభ్రం చేసినట్లు వెల్లడించారు. రోడ్లకిరువైపుల 10,844 కి.మీ. అవెన్యు ప్లాంటేషన్ చేపట్టడానికి అనువైన స్థలాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. పల్లెప్రగతిలో 6 లక్షల 39 వేల 822 మంది ప్రజలు శ్రమదానంలో పాల్గొన్నారన్నారు.
18వేల 718లోతట్టు ప్రాంతాలను గుర్తించి, నీటి నిల్వ ఉండకుండా మట్టితో పూడ్చటం జరిగిందన్నారు. 23వేల 150 ఇంకుడు గుంతలను, 4వేల 239 సామూహిక ఇంకుడు గుంతలను ఈ కార్యక్రమంలో భాగంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. విద్యుత్ శాఖ సిబ్బంది ఒక్క రోజు పవర్ హాలిడే కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు 19 వేల 674 స్థంబాలకు లైన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదే విధంగా పూర్తయిన వైకుంఠధామాలకు 1410 విద్యుత్ కనెక్షన్లు, 1773 వైకుంఠధామాలలో నీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.