Friday, November 22, 2024

దేశ గౌరవాన్ని పెంచిన ప్రవాస భారతీయుల విజయాలు.. ముగిసిన ఉపరాష్ట్రపతి విదేశీ పర్యటన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రపంచవ్యాప్తంగా భారత సంతతి ప్రజలు సాధిస్తున్న విజయాలే మనదేశం పట్ల గౌరవ భావాలను పెంపొందిస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 9 రోజుల మూడు దేశాల పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆయన, మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. గబాన్, సెనెగల్ పర్యటన అనంతరం ఖతార్ పర్యటన చివరి రోజు ఖతార్‌లోని భారత సంతతి ప్రజలు, వ్యాపారవేత్తలతో ఆత్మీయ సమావేశంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖతార్ దేశాభివృద్ధిలో భారత సంతతి ప్రజల కృషిని ఆయన అభినందించారు. ఖతార్‌లోని 7.8 లక్షల బలమైన భారతీయ సమాజం ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేస్తోందని అన్నారు. వందేభారత్ మిషన్, ఆపరేషన్ గంగ, ఆపరేషన్ దేవి శక్తి వంటివి ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని కాపాడేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత చర్యలను గుర్తు చేశారు. ఇరుదేశాల మధ్య గతేడాది కరోనా నేపథ్యంలోనూ 15 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరగడం శుభ పరిణామమని, ఖతార్‌లో సంపూర్ణంగా భారతీయుల ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీలు 50కి పైగా మౌలిక వసతుల, ఐటీ కంపెనీలుండటం అభినందనీయమన్నారు.

వచ్చే ఏడాది ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలకు 50 ఏళ్లు పూర్తవుతుండటాన్ని వెంకయ్య ప్రస్తావించారు. ఇరుదేశాలు సమగ్రమైన ఎనర్జీ భాగస్వామ్యాన్ని కొనసాగించడంతోపాటు, రక్షణ, భద్రత, ఆరోగ్య సంరక్షణ, విద్య రంగాల్లో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నాయని వెల్లడించారు. కరోనా నిర్వహణలో, భారతీయులతోపాటు ప్రపంచానికి టీకాలు అందజేయడంలో, పేదలకు ఆరోగ్య సంరక్షణ విషయంలో దేశ సుస్థిర, సమగ్రాభివృద్ధి తదితర అంశాల్లో భారతప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అందరి మన్ననలు అందుకుంటున్నాయని వివరించారు. శాంతితోనే పురోగతి సాధ్యమని ఉపరాష్ట్రపతి నొక్కి చెప్పారు. మూడు దేశాల పర్యటనలో ఉపరాష్ట్రపతితో పాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, ఎంపీలు సుశీల్ మోదీ,రీ విజయ్ పాల్ సింగ్ తోమర్, రవీంద్రనాథ్‌తో పాటు ఉపరాష్ట్రపతి కార్యాలయ ఉన్నతాధికారులు, విదేశాంగశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని వెంకయ్య నాయుడు దంపతులకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు స్వాగతం పలికారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement