Wednesday, November 20, 2024

India: ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సుబ్రమణియన్‌.. వెల్ల‌డించిన కేంద్ర ప్ర‌భుత్వం

అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌)లో భారతదేశానికి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మాజీ చీఫ్‌ఎకనామిక్‌ అడ్వైజర్‌ కె.వి. సుబ్రమణియన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం అధికారిక ప్రకటన చేసింది. సుబ్రమణియన్‌ పదవీకాలం నవంబర్‌ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ పదవిలో ఆయన మూడేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కొనసాగుతారు. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ , ప్రముఖ ఆర్ధికవేత్త సూర్జిత్‌ ఎస్‌ భల్లా పదవీకాలం అక్టోబర్‌ 31తో ముగుస్తుంది. ఐఎంఎఫ్‌లో భారత్‌ తరఫున ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా 2019లో భల్లా నియమితులయ్యారు. ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ సుబిర్‌ గోకర్న్‌ తర్వాత భల్లా కీలక పదవిని చేపట్టారు.

అంతర్జాతీయ ద్రవ్యనిధిలో భారతదేశానికి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ నియామకానికి కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.ఐఎస్‌బి హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌ అయిన సుబ్రమణియన్‌ను కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 2018లో సీఈఏగా నియమించింది. అరవింద్‌ సుబ్రమణియన్‌ తర్వాత ఆయన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టారు. సుబ్రమణియన్‌ చికాగో యూనివర్సిటీ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఫైనాన్సియల్‌ ఎకనామిక్స్‌లో ఎంబిఎ, డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ (పిహెచ్‌డి) డిగ్రీలు పొందారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ పర్యవేక్షణలో ఆ?న పీహెచ్‌డీ పూర్తిచేశారు. ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ అభ్యసించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement