హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ ఏరియాలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు భారీగా జరుగుతున్నాయి. ఏడాదిన్నరలో 5,456 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. వాటిల్లో మొత్తం 1,136 మంది మృతి చెందినట్లు రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మానిటరింగ్ సెల్ ప్రకటించింది. మరో 5,298 మందికి గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేయడానికి ఆర్టీఏఎమ్ సెల్‌ను ప్రారంభించారు.
గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను ఆ సెల్ సభ్యులు అధ్యయనం చేశారు. ప్రమాదాలు జరగడానికి గల కారణాలతో పాటు అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి? ఇంజనీరింగ్ లోపాలు, రోడ్ల నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారన్న అంశాలపై ఆ సెల్ నివేదిక తయారు చేసింది. ఒక ఏడాదిలో ఒకే ప్రాంతంలో 500 మీటర్ల పరిధిలో ఐదు ప్రమాదాలు జరిగితే ఆ ప్రాంతాన్ని యాక్సిడెంట్ స్పాట్‌గా పరిగణిస్తారు. సైబరాబాద్ పరిధిలో ఇటువంటివి మొత్తం 115 యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్‌లు ఉన్నట్లు ఆర్టీఏఎమ్ సెల్ గుర్తించింది.