Thursday, November 14, 2024

TG | విద్యార్థులారా.. మీరే ఈ తెలంగాణకు పునాదులు : సీఎం రేవంత్

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో వేలాది మంది విద్యార్థుల సమక్షంలో బాలల దినోత్సవాన్ని నిర్వహించింది. అంగన్‌వాడీ విద్యార్థులకు ప్రత్యేక యూనిఫాం, ప్రియదర్శిని అనే ప్రత్యేక పాఠ్య పుస్తకాలను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో కలిసి సీఎం రేవంత్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘11 నెలల పాలనలో తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిన రోజు. ఈరోజును మరిచిపోలేను’ అన్నారు. విద్యా రంగానికి ప్రజా ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను సీఎం వివరించారు. విద్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది.

అందుకే బడ్జెట్‌లో 7 శాతానికి పైగా నిధులు కేటాయించాం. గురుకులాల్లో పిల్లలకు సన్నబియ్యంతో మంచి ఆహారం అందించాలని ఆదేశించాం. అందుకే సన్నాలకు రూ. 500 బోనస్ ఇచ్చి కొంటున్నాం. నాణ్యమైన భోజనం అందించాలనే డైట్ చార్జీలను పెంచాం. అలాగే కాస్మొటిక్ చార్జీలను పెంచాం.

గ్రీన్ చానెల్ ద్వారా నిధులు మంజూరు చేయాలని ఆదేశాలిచ్చాం. బడులు తెరిచిన రోజునే పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాం. సమాజం వ్యసనాల వైపు వేగంగా పరుగెత్తుతోంది. చదువుకునే విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌కు బానిసలు అవుతున్న పరిస్థితి. వ్యసనాలకు బానిసలం కాబోమని విద్యార్థులంతా నాకు మాట ఇవ్వండి.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఈ ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ముళ్ల కంచెను తొలగించి బంగారు బాట వేసే బాధ్యత తీసుకుంటా. గతంలో ఏ ముఖ్యమంత్రి మీతో నడిచి మీతో చేయి కలుపలేదు. మీతో బాలల దినోత్సవం నిర్వహించుకోవడం ఎంతో సంతోషానిచ్చింది.”అని సీఎం రేవంత్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement