కరోనా అత్యంత తీవ్ర ప్రభావం చూపిన రంగాల్లో విద్యారంగం ఒకటి. ఎదిగే వయసులో తరగతి గదుల్లో బోధన, తోటి పిల్లలతో కలిసి వివిధ అంశాల్లో భాగస్వాములు కావడం వంటిని కోవిడ్ దూరం చేసింది. దీంతో చిన్న చిన్న పిల్లలపైనా దుష్ప్రభావం పడుతోంది. రెండేళ్లపాటు అంతంతమాత్రంగా తరగతులకు హాజరైన విద్యార్థులు అసలు తామేం నేర్చుకున్నామో మర్చిపోయి, పై తరగతుల్లో ఏమీ అర్థం కాక తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. కరోనా అనేది మానవాళికి కాకుండా విద్యకు పట్టిన వైరస్‌లా, ఆన్‌లైన్‌కు బానిసను చేసిన వ్యాధిగా పరిణమిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో దాదాపు 60 లక్షలమందికిపైగా చదువుకుం టున్నారు. కరోనా లాక్‌డౌన్, కర్ఫ్యూల కారణంగా పాఠశాలలకు వెళ్లి చదువుకునే పరిస్థితులు కొంతకాలం లేకపోవడంతో ఎంతో చురుకుగా ఉండే విద్యార్థులు స్తబ్ధంగా మారిపోతున్నారు. ఈ సమయంలో ప్రైవేట్ విద్యాసంస్థలు సెల్‌ఫోన్‌ల ద్వారా ఆన్‌లైన్ పాఠాలు బోధించాయి. ప్రభుత్వ రంగంలోనూ యాప్‌లు, యూట్యూబ్, టీవీ, రేడియో వంటి మాధ్యమాల ద్వారా బోధన జరిగింది. ఈ నేపథ్యంలో ‘ఆన్‌లైన్ క్లాసుల’ వంకతో పిల్లలు నిరంతరం ఫోన్‌లను అంటిపెట్టుకుని, ఏదో ఒకటి చేస్తుండటం అలవాటుగా మార్చుకున్నారు. దీంతో బాగా చదివే విద్యార్థులు కూడా గేమింగ్ యాప్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర కార్యక్రమా లు వీక్షించడం రోజువారీ పనిగా మార్చుకున్నారు. మరికొందరు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిచి, అపరిచిత వ్యక్తులతో చాటింగులు, ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం వంటివి నేర్చుకున్నారు. ఈ ఏడాది ఆలస్యంగానైనా ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడంతో వారికి కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రెండు క్లాసులు మారడంతో..
కరోనా కారణంగా రెండు విద్యా సంవత్సరాల్లో విద్యార్థులు చదివినా, చదవలేకపోయినా పై తరగతుల్లోకి వెళ్లిపోయారు. పరీక్షలనూ తక్కువ సిలబస్‌తో, ఒత్తిడి పడకుండా నిర్వహించడంతో కొత్త క్లాసుల్లోకి చేరిపోయారు. అయితే ఈ ప్రభావం విద్యార్థులపై తీవ్రంగా పడుతోంది. కరిక్యులమ్ ప్రకారం సిలబస్ పూర్తి కాకుండానే పై తరగతుల్లోని కొత్త పాఠ్యాంశాలు చదవాల్సి రావడంతో విద్యార్థుల తలకెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. అంతే కాకుండా ప్రత్యక్ష బోధనకు చాలాకాలం దూరంగా ఉండటంతో ఇప్పుడు తరగతులకు రావడం కొత్తగా అనిపిస్తోంది. ఈ ఏడాది కూడా తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో రాబోయే అర్ధ సంవత్సర పరీక్షల్లో ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటాయని ఉపాధ్యాయులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఆన్‌లైన్ చదువులు, ఇతర వ్యాపకాల ప్రభావం తరగతి గదుల్లో కూర్చుంటున్న విద్యార్థుల్లో స్పష్టంగా కనిపిస్తోందని, విద్యార్థులు పూర్తి దృష్టిని పుస్తకాలపై కేంద్రీకరించలేకపోతున్నారని పలువురు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్పేజీలను ఫాలో అవ్వండి..