Wednesday, November 20, 2024

విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచాలి.. సురేష్‌ కుమార్‌

అమరావతి, ఆంధ్రప్రభ: పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడలను సమర్థవంతంగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్‌, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్‌.సురేష్‌కుమార్‌ అన్నారు. గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో 66వ అండర్‌ 14,17,19 జిల్లాల స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శుల కార్యశాల మరియు ఎగ్జిక్యూటీవ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు శక్తి సామర్థ్యాల పరీక్ష నిర్వహించి ‘ఖేలో ఇండియా ఫిట్‌ నెస్‌’ యాప్‌ నందు వివరాలు నమోదు చేయాలని అన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు కనీసం రెండు ఆటల్లో శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పాల్గొనేలా వ్యాయమ ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు.

క్రీడల్లో ఆసక్తిగల విద్యార్థులను గుర్తించి వారికోసం పాఠశాల తరగతుల అనంతరం కూడా ప్రతి రోజూ రెండు గంటల సమయం అదనంగా కేటాయించాలని, విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని కోరారు. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి పాఠశాలలో క్రీడలు నిర్వహించేలా బాధ్యత వహించాలని అన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఉద్యోగంగా కాకుండా ఒక తపస్సులా భావించి విద్యార్థులను ఉన్నత స్థాయిలో ఎదిగేలా నిరంతర కృషి చేయాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement