విద్యార్థులకు ఏ సబ్జెక్టులోనైనా 100కు 100 మార్కులు వస్తే ఎగిరి గంతులు వేస్తారు. అదే 100 మార్కుల పశ్నాపత్రానికి 125 మార్కులు వస్తే..? ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఇదే జరిగింది. ఛత్రపతి షాహ్జీ మహరాజ్ విశ్వవిద్యాయం బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకు 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తే అంతకు మించి మార్కులు వచ్చాయి. బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ థర్డియర్ ఫలితాలలో మెటీరియల్ అండ్ మెథడ్ సబ్జెక్టులో తమకు వచ్చిన మార్కులు చూసుకున్న విద్యార్థులకు దానిపై ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు.
కావాలనే కొందరు ఇలా 100కు అంతకంటే ఎక్కువ మార్కులు వేశారని విద్యార్థులు అంటున్నారు. దీనిపై సదరు యూనివర్సిటీ విచారణ ప్రారంభించింది. అధ్యాపకులు పరీక్ష పత్రాలను దిద్దేటప్పుడు ఈ పొరపాటు జరిగిందా? లేదా ఫలితాల విడుదలలో సాంకేతిక కారణాల వల్ల ఈ ఘటన చోటు చేసుకుందా? అనే అంశంపై అధికారులు విచారణ చేపట్టారు. చాలా మంది విద్యార్థులకు 100కు 116 నుంచి 126 మార్కుల వరకూ మార్కులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అటు ఫొటోగ్రఫీ సబ్జెక్టు పరీక్షను 75 మార్కులకు నిర్వహిస్తే కొందరు విద్యార్థులకు 79 మార్కులు రావడం కొసమెరుపు.