అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియెట్ పాస్ సర్టిఫికెట్లను పంపుతున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరవ్ గౌర్ తెలిపారు. శనివారం ప్రింటింగ్ పూర్తి కావడంతో ఆదివారం నుంచి ఆర్ఐవోల ద్వారా ఆయా కాలేజీలకు పాస్ సర్టిఫికెట్లను పంపుతున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఆర్ఐవో పరిధిలోని కాలేజీలకు ఇప్పటికే వీటిని పంపామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేస్తూ విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజీలో శనివారం నిర్వహించిన సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పాల్గొనడంతో పాటు శ్రీ దుర్గా మల్లేశ్వరి మహిళా జూనియర్ కాలేజీ, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కాలేజీ, ఫిట్జీ జూనియర్ కాలేజీల్లో నిర్వహించిన కార్యక్రమాలను సైతం ఆయన సందర్శించారన్నారు.
ఇంటర్ పాసైన విద్యార్థులు మార్కుల జాబితాలను సోమవారం నుంచి సంబంధిత కాలేజీల్లో పొందొచ్చన్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ విద్యామండలి విద్యార్థులకు డీజీలాకర్ ద్వారా విద్యార్థులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 2023 సర్టిఫికెట్లను సైతం డిజీలాకర్‌లో నిక్షిప్తం చేసినందున విద్యార్థులు కాలేజీ మెమోలతో పాటు ఈ సేవలను కూడా సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. 2013-23 మధ్య కాలంలో 45.53లక్షల విద్యార్థులకు సంబంధించి డీజీలాకర్లో పాస్ సర్టిఫికెట్లతో పాటు మైగ్రేషన్, ఈక్వలెన్సీ, అర్హతా సర్టిఫికెట్లను పొందుపరిచామని తెలిపారు. ఫిజికల్ డాక్యుమెంట్లతో సమానంగా డిజీలాకర్ ఎలక్ట్రానిక్ కాపీలను అన్ని విద్యా సంస్థలు అనుమతించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2020లో ప్రభుత్వ ఉత్తర్వుల అమలుకు అన్ని విద్యా సంస్థలు అంగీకరించినట్లు ఆ ప్రకటనలో సౌరవ్ గౌర్ తెలిపారు.