Sunday, September 22, 2024

TG | హాస్టల్‌లో విద్యార్థి మృతి.. కుటుంబానికి కేటీఆర్ పరామర్శ

జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్‌ క్యాంపులోని గురుకుల పాఠశాలలో ఇటీవల పాముకాటుతో మృతి చెందిన విద్యార్థి అనిరుధ్ కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వారికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చనిపోవటంపై కేటీఆర్ ఆవేదన వ్య‌క్తం చేశారు. గత ఎనిమిది నెలల్లో గురుకులాల్లో 36 మంది మృత్యువాత పడ్డారని చెప్పారు. గురుకుల పాఠశాలలో ఆలనా పాలనా చూసుకునే వారు కరవయ్యారని చెప్పారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా విద్యార్థులకు మంచి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. బీఆర్ఎస్ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల తల్లితండ్రులకు గర్భశోకం మిగల్చవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

గురుకుల పాఠశాలలో చదివే పిల్లల బాధ్యత ప్రభుత్వానిదేనని, పిల్లలకు అందించే ఆహారంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో బాసరలో విద్యార్థులకు భోజనంపై భరోసా కల్పించామని తెలిపారు. కాగా, సంక్షేమ హాస్టళ్లను జిల్లా కలెక్టర్లు, అధికారులు ఆకస్మికంగా సందర్శించి ఆహార నాణ్యతను పరిశీలించాలని సూచించారు. ఈ బాధాకరమైన పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోని మేలు చేయాలని కోరుతున్నాన‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement