పటాన్చెరు, (ఆంధ్రప్రభ) : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లి గ్రామ శివారులోని నారాయణ కాలేజీలో బాల బోయిన వైష్ణవి అనే విద్యార్థి (16), ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఎవరు లేని సమయంలో విద్యార్థి హాస్టల్ లోని తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.
ఇది గమనించిన తోటి విద్యార్థులు కళాశాలకు చెందిన యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. హుటాహుటిన వైష్ణవిని బాచుపల్లిలోని ఎస్ఎల్జి ఆసుపత్రికి తరలించారు. వైష్ణవి గది కళాశాలలో సెకండ్ ఫ్లోర్ లోని 219 కాగా.. 315 రూమ్ లోకి వచ్చి బలవన్మరణానికి పాల్పడింది.
విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలు ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నత చదువుల కోసం కాయకష్టం చేసుకుని మా కూతురుని మీ కళాశాలలో చేర్పిస్తే ఇక్కడి ఇన్ చార్జిలు ఏం చేస్తున్నారు అని కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు.
ఎన్టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బాచుపల్లి ఘటన మరవకముందే మరోటి జరిగిందని ఇంత జరుగుతున్న నారాయణ కాలేజీ యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు. వైష్ణవి ఆత్మహత్యకు కారణాలను కళాశాల యాజమాన్యం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు బొల్లారం ఇన్ స్పెక్టర్ గంగాధర్ తెలిపారు.