Friday, November 22, 2024

కేసీఆర్ దిశానిర్దేశంలో పోరాటం.. సస్పెన్షన్‌పై మండిపడ్డ టీఆర్‌ఎస్ ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంట్‌లో తమ పోరాటం సాగుతుందని టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు తేల్చి చెప్పారు. విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళన చేస్తుండడంతో సభాకార్యక్రలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ మంగళవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ వివి 19 మంది సభ్యులపై ఈ వారాంతం వరకు సస్పెన్షన్ విధించారు. సస్పెండైన వారిలో టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, దీవకొండ దామోదర్‌రావు ఉన్నారు. ఎంపీ కె.ఆర్.సురేష్ రెడ్డితో కలిసి వారు విజయ్ చౌక్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ… ప్రజా సమస్యలపై చర్చ కోరితే సభ్యులను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణం అనుకూలించకపోయినా రోడ్డు మార్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల్లో భరోసా నింపారని ఆయన చెప్పుకొచ్చారు. ముంపు ప్రజల కోసం వెయ్యి కోట్లు ప్రకటించి, నష్టం అంచనాలను కేంద్రానికి పంపితే ఇప్పటివరకు స్పందన లేదని విమర్శించారు. జీఎస్టీ భారం, ధరల పెంపుతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము వారం రోజులుగా సభలో ఆందోళన చేస్తున్నా ప్రజా సమస్యలపై చర్చకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు. అప్రజాస్వామికంగా 19 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఇది బ్లాక్ డే అని రవిచంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రజాస్వామ్యం ఖూనీ
పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్‌తో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. దేశ ప్రజలు, రైతులు, యువతను నాశనం చేస్తూ ప్రభుత్వ సంస్థలను అమ్ముకునే పనిలోనే కేంద్ర పెద్దలు ఉన్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి దిశానిర్ధేశంలో జీఎస్టీ భారం, ధరల పెరుగుదల, వరద సాయం కోసం పోరాడుతున్నామని ఆయన తెలిపారు. కేంద్రప్రభుత్వం కక్ష కట్టి తెలంగాణకు ద్రోహం చేస్తోందని లింగయ్య యాదవ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలను భారతీయులుగా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా పాలు, ఆహార ఉత్పత్తులపై పన్నులు పెంచడంపై చర్చకు అనుమతించకపోవడంతో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపామని గుర్తు చేశారు. పేదల పార్టీ అయిన టీఆర్ఎస్ ప్రజలకోసం పోరాడుతుందని లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు.

ప్రజా సమస్యలకు పెద్దల సభ వేదిక
పెద్ద సంఖ్యలో విపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను రాజ్యసభ చరిత్రలో కనీవినీ సంఘటనగా చూడాలని ఎంపీ సురేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మొత్తం ప్రతిపక్షం ఒక్కటే అంశంపై పెరుగుతున్న ధరలపై చర్చకు పట్టు పట్టిందని తెలిపారు. ఇలాంటి డిమాండ్ స్పీకర్ వద్ద అఖిలపక్షంతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. పార్లమెంట్ సంప్రదాయం ప్రకారం ప్రభుత్వ స్పందన రావాలన్నారు. రాష్ట్రాల అంశాలను చర్చించేందుకు పెద్దల సభ వేదిక కావాలని సురేష్ రెడ్డి అన్నారు. వరద సహాయం చేయమని కోరితే పార్టీ ఎంపీలను సస్పెండ్ చేశారని, పార్లమెంట్ నిబంధనలను పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు.
ప్రజా సమస్యలపై చర్చ జరిగితే ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే ఒప్పుకోవడం లేదని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement