Tuesday, November 26, 2024

ప్రజాక్షేత్రంలో పోరాటం.. న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కొంటాం : గిడుగు రుద్రరాజు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాహుల్ గాంధీ అనర్హత వేటు వ్యవహారంపై ప్రజాక్షేత్రంలో పోరాడతామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలు శిక్ష, ఆ వెంటనే అనర్హత వేటు అంశాలపై న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని చెప్పారు. పార్టీలో న్యాయ నిపుణులైన అభిషేక్ మను సింఘ్వీ, పి. చిదంబరం, ఆనంద్ శర్మ న్యాయపరంగా ఉన్న అవకాశాల గురించి వివరించారని చెప్పారు. అలాగే పార్టీ రాజకీయంగానూ గట్టిగా ఎదుర్కొంటామని అన్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్టు గిడుగు రుద్రరాజు చెప్పారు. నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలపై ఏఐసీసీ ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించి తమకు అందజేస్తుందని, ఆ ప్రకారం అన్ని రాష్ట్రాల్లో ప్రదర్శనలు చేపడతామని అన్నారు.

మరోవైపు ఉన్నత న్యాయస్థానాల్లో రాహుల్ గాంధీకి ఊరట లభిస్తుందని గిడుగు రుద్రరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. అనర్హత వేటు కారణంగా 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీని పోటీ చేయకుండా కుట్ర చేశారని, కానీ ఉన్నత న్యాయస్థానాల్లో ఊరట లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే ప్రజాక్షేత్రంలో సామాన్య ప్రజలందరికీ అర్థమయ్యేలా కుట్ర గురించి వివరిస్తామని అన్నారు. కర్ణాటకలో జరిగిన ఘటనకు, గుజరాత్‌లో కేసు పెట్టి, జిల్లా కోర్టు ద్వారా శిక్షపడేలా కుట్ర చేశారని ఆరోపించారు.

- Advertisement -

ఏఐసీసీ కార్యాలయంలో సాయంత్రం గం. 6.15కు ప్రారంభమైన ఈ సమావేశంలో గిడుగు రుద్రరాజు సహా తెలుగు నేతలు జేడీ శీలం, వంశీచంద్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొనగా, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్టీరింగ్ కమిటీ నేతలు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు హాజరయ్యారు. ఢిల్లీలో అందుబాటులో ఉన్నావారు నేరుగా సమావేశానికి హాజరవగా, ఢిల్లీలో లేనివారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కీలక భేటీలో పాల్గొన్నారు. వీరితో పాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా సమావేశానికి హాజరవగా, రాహుల్ గాంధీ మాత్రం దూరంగా ఉన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement