న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో చేపట్టిన నిరసన ప్రదర్శనకు సీపీఐ(ఎంఎల్) రివల్యూషనరీ ఇనీషియేటివ్ మద్ధతు ప్రకటించింది. ఈ మేరకు శని, ఆదివారాల్లో ఢిల్లీలో జరిగిన పార్టీ సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఓవైపు, అంతకంతకూ పెరుగుతున్న నిరుద్యోగం మరోవైపు సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటే కేంద్ర ప్రభుత్వం వాటిని పరిష్కరించాల్సింది పోయి ఆరెస్సెస్-బీజేపీ తమ మత ఎజెండాను అమలు చేయాలని చూస్తున్నాయని సీపీఐ(ఎంఎల్)ఆర్ఐ పార్టీ పేర్కొంది.
పార్టీ సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాకూర్ పేరిట విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరెస్సెస్-బీజేపీ మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. అలాగే కనీస మద్ధతు ధరతో పాటు రైతు సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సంయుక్త్ కిసాన్ మోర్చా కార్యక్రమాలకు మద్ధతివ్వాలని ప్రజలను కోరారు.