Wednesday, November 20, 2024

సమాజ వ్యతిరేక నియమాలకు వ్యతిరేకంగా పోరాటం.. టీఆర్ఎస్ ఎంపీలతో మార్గరెట్ అల్వా భేటీ..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి కేసీఆర్ అందరితో చర్చించి మార్గరెట్ అల్వాకు మద్దతు తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు వెల్లడించారు. విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. కేసీఆర్ ఆదేశానుసారం 16 మంది ఎంపీలు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆమె కృతజ్ఞతాపూర్వకంగా కేకే ఇంటికి వెళ్లారు. తనకు మద్దతు ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. అనంతరం మార్గరెట్ అల్వాకు తమ పార్టీ ఎంపీలందరినీ కేకే పరిచయం చేశారు. ఎంపీలు ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె. కేశవరావుతో పాటు ఎంపీలు నామ నాగేశ్వరరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కె. ఆర్. సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావు, బీబీ పాటిల్, రంజిత్ రెడ్డి, రాములు, బడుగుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేకే మాట్లాడుతూ… సమాజ వ్యతిరేక నియమాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. వజ్రోత్సవ వేడుకలు పోటీగా చేయడం లేదన్నారు.

సాయుధ పోరాటంలో, స్వతంత్ర ఉద్యమాల్లో ఉన్న వారిని గుర్తు చేసుకుంటున్నామని వివరించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా సమాజం నడవాలని కేకే ఆకాంక్షించారు. మోదీ అధికారంలోకి వచ్చాక ఫెడరలిజం బోగస్ చేశారని, ప్రజాస్వామ్యమనేదే లేదని ఆయన స్పష్టం చేశారు. మతం పేరిట సమాజాన్ని విభజిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ సంస్థల అమ్ముకుంటున్నారని కేకే మండిపడ్డారు. ఆరోగ్యం, విద్యపైన ఎలాంటి దృష్టీ లేదని ఆరోపించారు. ఏడేళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చూడండని కేకే అన్నారు. దేశంలోనే ముందున్న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితి అన్ని రంగాల్లో డబుల్ అయ్యిందని హర్షం వ్యక్తం చేశారు.
దేశం మొత్తం బీజేపీతో లేదన్న కేకే, ఎన్నికల్లో వాళ్లకు వచ్చిన ఓట్ల శాతం చూడండన్నారు. శనివారం టీఆర్ఎస్ పార్టీ 16 మంది ఎంపీలం మార్గరెట్ అల్వాకు ఓటు వేస్తామని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌తో లేకపోవడం వల్లే ఆమెకు మద్దతిస్తున్నామని కేకే స్పష్టం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement