Wednesday, November 20, 2024

విద్యుత్‌ కార్లలో టెస్లాకు గట్టి పోటీ.. అమ్మకాల్లో దూసుకుపోతున్న బీవైడీ

విద్యుత్‌ కార్ల అమ్మకాల్లో ప్రపంచ వ్యాప్తంగా గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా చైనాకు చెందిన బిల్డ్‌ యువర్‌ డ్రీమ్స్‌ (బీవైడీ) కంపెనీ టెస్లాకు అంతర్జాతీయంగా మార్కెట్‌లో పోటీ పడుతోంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టెస్లా 4,35,059 యూనిట్లను విక్రయిస్తే, బీవైడీ 4,31,603 యూనిట్లను విక్రయించింది. టెస్లా కంటే కేవలం 3,456 యూనిట్లు మాత్రమే వెనుకబడి ఉంది. గతకు ముందు త్రైమాసికం కంటే బీవైడీ కంపెనీ ఉత్పత్తి 23 శాతం పెరిగింది.

వాస్తవానికి బీవైడీ కంపెనీ విద్యుత్‌, హైబ్రీడ్‌ వాహనాలు మొత్తం 8,22,094 యూనిట్లు తయారు చేసి రికార్డ్‌ సృష్టించింది. ప్రస్తుతం ఈ కంపెనీ చైనాతో పాటు పలు దేశాల్లో టాప్‌ సేల్స్‌ ఉన్న కంపెనీగా ఉంది. నాలుగో త్రైమాసికంలో టెస్లా కంటే బీవైడీ కంపెనీ ఎక్కువ విద్యుత్‌ కార్లను విక్రయించే అవకాశం ఉందని ఈ రెండు కంపెనీలకు ఫండింగ్‌ చేస్తున్న షెన్‌జెన్‌ కేంద్రంగా పని చేస్తున్న హెడ్జ్‌ ఫండ్‌ కంపెనీ స్నోబుల్‌ సీఈఓ టైలర్‌ ఓగన్‌ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

బీవైడీ కంపెనీ విదేశాల్లోనూ తక్కువ ధరలోనే అత్యాధునిక ఫీచర్లు, అధిక రేంజ్‌ ఇచ్చే కార్లను విక్రయిస్తోంది. దీంతో చైనాతో పాటు, అమెరికా, యూరోపియన్‌ దేశాల్లోనూ టెస్లాకు బీవైడీ గట్టి పోటీ ఇస్తోంది. బీవైడీ కంపెనీ ఇటీవల రెండు లగ్జరీ ఈవీ కార్లను మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. యాంగ్వాంగ్‌, ఫాంగ్‌ చెంగ్‌ బావో పేరుతో వీటిని విడుదల చేసింది. 1,37,000 డాలర్లలోపు ధరలో ఇవి లభిస్తాయి. ఇదే సిగ్మెంట్‌లో ఉన్న ఇతర కార్ల కంటే వీటి ధర సగం మాత్రమే ఉంది.

మన దేశంలో బీవౖౖెడీ ఈ-6, ఓట్టో 3 పేరుతో ప్రస్తుతం రెండు కార్లను విక్రయిస్తోంది. భారత్‌ మార్కెట్లోకి భారీ స్థాయిలో ప్రవేశించేందుకు 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో కార్ల తయారీతో పాటు, విద్యుత్‌ బ్యాటరీ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు సమర్పించిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుతం బీవైడీ గ్లోబల్‌ మార్కెట్‌లో ఎగుమతులు 9 శాతంగా ఉన్నాయి. గత త్రైమాసికంలో ఇవి 5 శాతంగా నమోదయ్యాయి.

చైనా కంపెనీల పెట్టుబడులపై కొన్ని యూరోపియన్‌ దేశాల్లోనూ ఆంక్షలు ఉన్నందున బీవైడీ విస్తరణకు కొంత ఇబ్బందిగా ఉందని భావిస్తున్నారు. అమెరికా మార్కెట్‌లో బీవైడీ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ఇటీవల టెస్లా తక్కువ ధరలో బేస్‌ మోడల్‌ వైని విడుదల చేసింది. అయితే మొత్తంగా చూస్తే టెస్లాకు గ్లోబల్‌ మార్కెట్‌లో బీవైడీ నుంచి గట్టి పోటీ ఉంటుందని ఆటో రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement