Thursday, November 21, 2024

ధాన్యం అన్‌లోడ్‌ చేయని మిల్లర్లపై కఠిన చర్యలు.. సిద్ధమవుతున్న జిల్లా యంత్రాంగం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని సకాలంలో అన్‌లోడ్‌ చేసుకోకుండా ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్న రైస్‌ మిల్లులపై ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగాలు చర్యలకు దిగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వరికోతలు చివరి దశకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కోయని వరి చేలు ఈ ఏడు సాగు అయిన దాంట్లో 30శాతం దాకా ఉంటాయని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన పది రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యాన్ని రైతులు తరలిస్తున్నోరు. కొనుగోలు కేంద్రాల్లోనూ అధికారులు ధాన్యం కొనుగోళ్లను ముమ్మరం చేశాయి. సాధ్యమైనంత త్వరగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంతోపాటు తూకం వేసి రైస్‌ మిల్లులకు తరలిస్తున్నారు. దీంతో కల్లాల్లో రైతులకు స్థలం అందుబాటులోకి రావడంతోపాటు అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా రక్షిస్తున్నారు.

అయితే పలు జిల్లాల్లో మిల్లర్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు గండి కొడుతున్నారు. ధాన్యాన్ని తూకం వేసి లారీలో లోడ్‌ చేసి మిల్లుకు తరలించిన తర్వాత రోజుల తరబడి అన్‌లోడ్‌ చేసుకోవడం లేదు. దీంతో కల్లాల్లో ధాన్యం కొనుగోళ్లలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో మిల్లు యజమాన్యాలపై కఠిన చర్యలకు దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయా జిల్లా యంత్రాంగాలు చెబుతున్నాయి. మిల్లుకు ధాన్యం వచ్చిన 48 గంటల్లోగా ధాన్యాన్ని అన్‌లోడ్‌ చేయాల్సిందేనని రైస్‌ మిల్లుల యాజమాన్యాలకు జిల్లా కలెక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ధాన్యాన్ని అన్‌లోడ్‌ చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్లపై కఠిన చర్యలకు దిగుతున్నారు. ధాన్యం అన్‌లోడ్‌ చేయకుండా ఇబ్బందులు పెడుతున్న రైస్‌ మిల్లులను అవసరమైతే సీజ్‌ చేయాలని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేశారు.

పలు జిల్లాల్లోని రైస్‌ మిల్లుల యజామాన్యాలు తరుగు తీసేందుకు అంగీకరిస్తేనే ధాన్యం అన్‌లోడ్‌కు అంగీకరిస్తున్నారు. 40 కిలోల బస్తాకు 5 నుంచి 10 కిలోల దాకా తరుగు తీస్తున్నారు. దీంతో కల్లాల్లో తూకం అయిన క్వింటాళ్ల మేర కంటే తక్కువగా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. దాంతో పాటు ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ధాన్యం అన్‌లోడ్‌ చేసుకోకుండా ఇబ్బందులు పెడుతున్న మెదక్‌ జిల్లాలోని 34 రైస్‌ మిల్లులకు ఇప్పటికే ఆ జిల్లా అదనపు కలెక్టర్‌ రమేష్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. జిల్లాలోని కొన్ని రైస్‌ మిల్లులు ఇప్పటి వరకు ధాన్యం అన్‌లోడ్‌ ప్రాసెస్‌ను మొదలు పెట్టకపోగా మరికొన్ని రైస్‌ మిల్లుల యాజమాన్యాలు సన్న ధాన్యాన్ని మాత్రమే అన్‌లోడ్‌ చేసుకుంటూ దొడ్డు ధాన్యాన్ని నిరాకరిస్తున్నాయి. దీంతో ఆ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా నిజామాబాద్‌ జిల్లాలో 21 రైస్‌ మిల్లులకు, నల్గొండ జిల్లాలో 17 రైస్‌ మిల్లులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా ధాన్యం అన్‌లోడింగ్‌ను ప్రారంభించాలని ఆ మిల్లుల యాజమాన్యాలకు జిల్లా యంత్రాంగాలు అల్టిమేటం జారీ చేశాయి. లేనిపక్షంలో మిల్లులను సీజ్‌ చేస్తామని నోటీసుల్లో స్పష్టం చేశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement