అమరావతి, ఆంధ్రప్రభ: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న ఈశాన్య శ్రీ లంక పరిసర ప్రాంతాలపై ఉన్న తీవ్ర అల్పపీడన ప్రాంతం ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న ఈశాన్య శ్రీలంక వద్ద ఉన్న తమిళనాడు తీరం మీద అనుబంధం గా ఉన్న ఉపరితల ఆవర్తనం తో సగటు- సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నది . ఇది శనివారం ఉదయం వరకు వాయువ్య దిశగా తమిళనాడు పుదుచ్చేరి తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది.
ఈనెల 13వ తేదీన ఆగ్నేయ ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం లేదా ఉపరితల ఆవర్తనం గా ప్రవేశించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది. నెల్లూరు, తిరుపతి, కడప, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఈనెల 15వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.