Friday, November 22, 2024

Delhi | భారత్-ఈజిప్ట్ సాంస్కృతిక బంధాలు బలోపేతం.. జగన్నాథ యాత్ర రైలును ప్రారంభించిన కేంద్రమంత్రులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత్-ఈజిప్ట్ మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసీ సమక్షంలో ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి సంబంధించిన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, ఈజిప్టు విదేశాంగ మంత్రి శ్రీ సమే షౌక్రీ మధ్య ఒప్పంద మార్పిడి బుధవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో జరిగింది. భారత్- ఈజిప్ట్ దేశాల మధ్య ద్వైపాక్షిక సాంస్కృతిక బంధాల బలోపేతం కోసం కుదిరిన ఈ ఒప్పందంలో సంగీతం, నృత్యం, అభినయం, సాహిత్యం, పరిశోధన పత్రాల మార్పిడి తదితర అంశాల్లో పరస్పర సహకారం, ఇరుదేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలు ఉన్నాయి.

అంతకుముందు రైల్వే శాఖ, కేంద్ర పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ‘భారత్ గౌరవ్ పర్యాటక రైళ్ల’ పరంపరలో భాగంగా శ్రీ జగన్నాథ్ యాత్ర ప్రత్యేక రైలు ప్రారంభమైంది. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్‌లో కేంద్ర పర్యాటక-సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు.
ఇది భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శన కోసం ఉద్దేశించిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు. జాతీయ పర్యాటక దినోత్సవం, జాతీయ ఓటర్ల దినోత్సవం రోజే ఈ ప్రత్యేక రైలును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement