హైదరాబాద్, ఆంధ్రప్రభ: శతాబ్దాల చరిత్ర తన ఒడిలో దాచుకున్న అద్భుత నగరం హైదరాబాద్. ప్రాచీన ఇస్తాంబుల్ నగర వాస్తురీతులతో హైదరాబాద్ పట్టణ నిర్మాణం జరిగింది. ఇస్తాంబుల్ వాస్తురీతుల్లో పట్టణాల మధ్యలో సరస్సులు నిర్మించడం ఆనవాతిగా ఉండేది. ఈ నేపథ్యంలో గొల్కొండ రాజులు కులీకుతుబ్ షాహీలు హైదరాబాద్ పట్టణ నిర్మాణంతో పాటుగా సరస్సులు నిర్మించి హైదరాబాద్‌ను అందంగా తీర్చిదిద్దారు. పెద్దవీధులు, విశాలమైన భవంతులు, కనుల విందుచేసే చెరువులు హైదరాబాద్ నగర ప్రత్యేకత. నగరం మధ్యలో హృదయ ఆకారాంలో నిర్మించిన హుస్సేన్ సాగర్ నాటి రాజుల వైభవానికి ప్రతీక, నాలుగు వేలకు పైగా సరస్సులతో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ ఖ్యాతి గాంచింది.. అయితే ఇది గతవైభవం. నాటి చెరువులు, సరస్సులు, కుంటలు నేడు కనుమరుగై పోయాయి. రాష్ట్రంలో కాకతీయుల కాలం నుంచి నిజాం రాజుల వరకు ఉన్న సుమారు లక్షన్నర చెరువులు తమ ఉనికిని కోల్పొయి, కాంక్రీట్ భవంతుల కింద మసకబారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో చెరువులు కుంటలు కలిపి 46వేల 531 మాత్రమే ఉన్నాయి.
చెరువు గట్ల మీద జరగాల్సిన పండుగలు వీధుల్లో…
పచ్చని పంటపొలాలు, విశాలమైన రాచవీధలు, అందమైన భవంతులు కనుమరుగయ్యాయి. చెరువు దగ్గరి గంగమ్మలు, కట్టమీది మైసమ్మలు వీధుల్లో కొలువుతీరాయి. చరువు గట్ల మీద జరపాల్సిన పండుగలు కూడా నగరాల్లోనే జరుకునే పరిస్థితి ఏర్పడింది. చెరువు, కుంటల స్థలాలను చెరపట్టి కాసుల పంట పండించుకునే కబ్జాకోరులు తెలంగాణ నీటి పారుదల రంగానికి ధ్వంస రచనచేశారు. వేలాది చెరువులు,కుంటలు కాంక్రీట్ జెంగల్ లో కలిసిపోగా మిగిలన చెరువులు గతవైభవానికి ప్రతీకగా సాక్ష్యం చెపుతున్నాయి. ప్రతి చెరువు ఓ చారిత్రిక సంపద, నాటి రాజులు, సామంతులు, జమీందారులు, చక్రవర్తులు నిర్మించినవి ఉండగా అత్యంత ప్రాచీన హస్మత్ పేట చెరువుకు కూడా కబ్జా చీడపట్టింది.
1956 భాషాప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ అవతరించే నాటికి హైదరాబాద్ లో 5వేల 32 చెరువులు ఉన్నట్లు పక్కా నివేదికలున్నాయి. చెరువులకు అనుసంధానంగా వేలసంఖ్యలో కుంటలు ఉండేవి. అయితే చెరువులు కుంటలను కబ్జాచేసి ఆకాశహర్మ్యాలు నిర్మించడంతో చెరువుల పేరుతో బస్తీలు ఆవిర్భవించాయి. రాచవీధుల పేరుతో భవనాలు నిర్మించబడ్డాయి. 1996లో ప్రభుత్వం చేయించిన సర్వేలో ఉపగ్ర ఛాయాచిత్రం మేరకు 112 చదరపు గజాల విస్తీర్ణంలో932చెరువులు ఉన్నట్లు నివేదికలున్నయి. అలాగే 2000 లసంవత్సరంలో 90 చదరపు కిలో మీటర్ల పరిధిలో జరిపిన క్షేత్ర స్థాయి సర్వేలో 169 చెరువులున్నట్లు తెలిసింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ వించే నాటికి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కేవలం 95 చెరువులు మిగలగా మిషన్ కాకతీయ ప్రాజెక్టులో భాగంగా ఈ చెరువుల పునరుద్ధరణ జరిగింది.
కబ్జాలకు గురికాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసి కాపాడే ప్రయత్నం జరుగుతుంది. శిఖం భముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగేనెదర్లాండ్ నిధులతో 87చెరువుల ప్రక్షాళన ప్రారంభించారు. మిషన్ కాకతీయ పరిధిలోని నిధులతో అభివృద్ధి జరుగుతుంది.
చెరువులు పోయాయి…పేర్లు మిగిలాయి
చెరువుల పేర్లు మిగిలాయో కానీ చెరువులు మాయం అయ్యాయి. ఉదహారణకు నల్లకుంట, బతుకమ్మకుంట,నాగమయ్య కుంటలు మాయమై ఆపేరుతో బస్తీలు వచ్చాయి. అలాగే 30 ఎకరాల కూకట్ పల్లి చెరువు 2ఎకరాల మురికి కుంటగా మారింది. 8.15ఎకరాల విస్తీర్ణంలోని ఖాజా కుంట చెరువు మురుగు కుంటగా అవతరించింది. ప్రగతినగర్ అంబీర్ చెరువు శిఖం భూమిలో భవనాలు వెలిచాయి. మియాపూర్ లోని గంగారం చెరువు స్థలం భవనాలు కట్టారు. కూకట్ పల్లిలోని చెరువులు కబ్జాకు గురయ్యాయి. హస్మత్ పేట చెరువుస్థలం లో 169 అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు అధికారుల రికార్డుల్లో ఉంది. తుమ్మడి చెరువు మాయమైంది. యూసుఫ్ గూడా చిన్న చెరువు కృష్ణా నగర్ గా మారిపోయింది. హూస్సేన్ సాగర్ తీరాన కట్టడాలు వెలిశాయి.
గోల్కొండ కోటకు నీరు అందించిన చెరువు కబ్జాకు గురికాగా మిగిలిన స్థలం పర్యాటకరంగంలో తీర్చి దిద్దారు. శిల్పారామం ఎదురుగా తుమ్మిడి చెరువు కానరాదు, అమీర్ పేట చెరువు అమీర్ పేట కాలనీగా మారింది. లంగర్ హౌజ్ చెరువు బాగ్దాద్ నగర్, సజ్జాద్ నగర్ గా అవతరించాయి. శాతంచెరువు నంద కాలననీ, అరుణ కాలనీగా అవతరించాయి. తుమ్మలకుంట న్యూ హకీం పేట, పుప్పాల గూడ భారతమ్మ చెరువు పట్టణీకరణలో భాగమైంది. అలాగే యశోద ఆసుపత్రి ఉన్న ప్రస్తుత స్థలంలో ఒకప్పుడు చెరువుల నీటితో వ్యవసాయం, ఇందిరాపార్కు పరిసరాల్లో పచ్చని పంటపొలాలు, బాగ్‌లింగం పల్లిలో పచ్చని పండ్ల తోటలున్నాయనేది చారిత్రిక సత్యం. నేటి తరానికి తెలియని రహస్యం.