నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ పూర్తిగా ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మలివిడత ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జానారెడ్డి అంటే టీఆర్ఎస్ కు భయం పట్టుకుందా? ఉపఎన్నికలో ఓడిపోతామా? అనే అనుమానాలు ఆపార్టీలో వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. నాగార్జునసాగర్ లో జానారెడ్డి చాలా సీనియర్ నేత, ఏడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు. దీంతో ప్రజలు ఆయనవైపే వెళ్తారా అన్న అనుమానం టీఆర్ఎస్ లో వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. సాగర్ ఎన్నికలో ఎత్తులు..పై ఎత్తులురాజకీయ చదరంగంలో ఆసక్తి రేపుతున్నాయి.
అధికార పార్టీ నేతలంతా నాగార్జున సాగర్ లోనే మకాం వేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ఇక, ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కంటే జానారెడ్డినే స్ట్రాంగ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా.. సవాళ్లు.. ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి.
‘నామినేషన్లు వేసి.. అందరం ప్రచారం చేయకుండా సైలెంట్‌గా ఉందా.. ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చినవారికి ఓట్లు వేయనిద్దాం.. ఎవరు గెలుస్తారోచూద్దాం’ అని ఇటీవలే జానారెడ్డి టీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. అయితే, గులాబీ నేతలు ఆ సవాల్ ను స్వీకరించలేదు కానీ విమర్శలకు పదను పెట్టారు.
ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి నిరోధక పార్టీ అని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. జానాకు వయస్సు మీదపడిందని, అయినా గెలిచి ఇక్కడ చేసేది ఏం లాభం లేదని విమర్శు మంత్రి తలసాని గుప్పిస్తున్నారు. హోంమంత్రి మహమూద్ అలీ కూడా భగత్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నోముల నర్సింహయ్య సంచలన విజయం సాధించి జానా వరుస విజయాల పరంపరకు చెక్ పెట్టారు. నోముల హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని తిరిగి ఎలాగైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని అధికార టీఆర్‌ఎస్.. సాగర్‌ను దక్కించుకోవడం ద్వారా రాష్ట్ర రాజకీయాలను తన వైపునకు తిప్పుకోవాలని బీజేపీ .. ఇలా మూడుకు మూడు పార్టీలు ఎత్తులకుపై ఎత్తులు వేస్తున్నాయి.
ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ ప్రచార వ్యూహాన్ని మార్చింది. ఎన్నికల ప్రచార బాధ్యతలు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి అప్పగించారు. ఎన్నికల సమన్వయకర్తగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పొరుగు జిల్లాల ఎమ్మెల్యేలకు తోడుగా ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలను మండల ఇన్చార్జిలుగా నియమించింది. కులాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన లీడర్లను ఎన్నికల ప్రచారానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా యాదవ, ఎస్టీ కులాల ఓట్లను రాబట్టేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.
ఎన్నికల్లో పోటీ అనేది టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని అధిష్ఠానం క్లారిటీతో ఉందని గులాబీ కార్యకర్తలు చెప్తున్నారు. దీంతో గ్రామాలవారీగా ఇన్చార్జిలు, మండల ఇన్‌చార్జిలతోనే ప్రచారాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఎన్నికల ప్రచారానికి మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ వస్తారని పార్టీ లీడర్లు చెప్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.
ఇక, కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నాయకుడు జానారెడ్డి వ్యూహాత్మక పోరు సాగిస్తున్నారు. ప్రచారంలో అధికార పార్టీ కంటే ముందుగానే గ్రామాలను జల్లెడ పట్టిన ఆయన మలి విడత ప్రచారాన్ని చాలా వ్యూహాత్మకంగా నడిపించాలని ప్లాన్ చేస్తున్నారు. జనగర్జన సభతో నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకున్న ఆయన మలివిడత ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకే హైకమాండ్ పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల ప్రచారానికి పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్లు రానున్నారు. ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే మకాం పెడ్తారని చెప్తున్నారు. ఏప్రిల్ 17న ఎన్నికల పోలింగ్ జరుగనుండగా.. మే 2న ఫలితం వెల్లడి కానుంది. ఎన్నిక వరకు ఈ రెండు పార్టీల మధ్య ఇంకా ఎన్ని మాటల తుటాలు పేలుతాయో చూడాలి.