బీహార్‌లోని మధుబని జిల్లాకు చెందిన బుద్ధినాథ్ జా అలియాస్ అవినాష్ జా (22) లోకల్ న్యూస్ పోర్ట్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. తను రాసిన నకిలీ క్లినిక్‌ల కథనాలను ఇటీవల తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టాడు.
నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన 22 ఏండ్ల జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. నకిలీ క్లినిక్‌లపై కథనాలు రాయడంతో ఆ జర్నలిస్టుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
దీంతో మంగళవారం రాత్రి అతన్ని కిడ్నాప్ చేశారు. బెనిపట్టీ లోహియా చౌక్‌లోని తన నివాసం వద్ద చివరిసారిగా మంగళవారం రాత్రి 10 గంటలకు కనిపించినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. బుద్ధినాథ్ నివాసం బెనిపట్టి పోలీసు స్టేషన్‌కు 400 మీటర్ల దూరంలో ఉంది.అయితే రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన బుద్ధినాథ్.. అక్కడున్న రోడ్డుపై తిరుగుతూ పలు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. తన క్లినిక్ కూడా తెరిచే ఉంది. ల్యాప్ టాప్ ఆన్ చేసి ఉంది. చివరగా రాత్రి 9:58 గంటలకు కనిపించాడు. ఆ సమయంలో పసుపు రంగు స్కార్ఫ్ మెడలో వేసుకున్నాడు జర్నలిస్ట్.
బుద్ధినాథ్ జా రెండు రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జర్నలిస్ట్ ఫోన్ సిగ్నల్స్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. బెనిపట్టీకి ఐదు కిలోమీటర్ల దూరంలోని బెటౌన్ వద్ద జర్నలిస్టు ఫోన్ సిగ్నల్స్ బుధవారం రాత్రి 9 గంటల వరకు కట్ అయినట్లు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ అక్కడ బుద్ధినాథ్ కనిపించలేదు. బెటౌన్ జాతీయ రహదారి పక్కన జర్నలిస్టు మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. చేతికి ఉన్న రింగ్, మెడలో ఉన్న బంగారు గొలుసు, కాలిపై ఉన్న గాయంతో అతను బుద్ధినాథ్ అని కుటుంబ సభ్యులు గుర్తించారు. జర్నలిస్టుపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు నిర్ధారించారు.