Saturday, November 23, 2024

Story : అంద‌రితో క‌లుస్తా..అందుబాటులో ఉంటా- కిర‌ణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య‌ల వెనుక మ‌ర్మమేంటో..

ఈ మ‌ధ్య‌కాలంలో జ‌న‌సేన పార్టీలో న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి జాయిన్ అవుతార‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ అవి రూమ‌ర్స్ గానే మిగిలాయి.కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 నుంచి దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత కిర‌ణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ రాహుల్ గాంధీల నుంచి ఇటీవల పిలుపు వచ్చింది. సోనియా రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. మరోమారు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని వారు కిరణ్ ను కోరారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కిర‌ణ్ కుమార్ రెడ్డి జూన్ 22న చిత్తూరు జిల్లా కలికిరిలో పర్యటించారు. తన ఒకప్పటి నాయకులు.. కార్యకర్తలు.. అనుచరులు అందరినీ పేరుపేరునా పలకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర పీసీసీ కార్యదర్శి కేఎస్ అఘామోహిద్దీన్ జిల్లా కాంగ్రెస్ మాజీ కార్యదర్శి డాక్టర్ శ్రీవర్ధన్ పలువురు నాయకులు అభిమానులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలతో ప్రత్యేకంగా మాట్లాడారు. కార్యకర్తలు అభిమానులను పేరుపేరునా పలకరిస్తూ వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వచ్చిన కుమారుడు నిఖిలేష్ కుమార్ రెడ్డిని అందరికీ పరిచయం చేశారు.అలాగే మదనపల్లెలో మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్ కుమార్ రెడ్డిని.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. నరేష్ కుమార్ రెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తూ కిందపడటంతో ఆయన చేతికి గాయమైంది. హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత మదనపల్లెలోని ఇంటికి చేరుకున్నారు. దీంతో మదనపల్లె బైపాస్ రోడ్డులో నివాసముంటున్న నరేష్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లిన కిరణ్ ఆయనను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తన స్వగ్రామం నగిరిపల్లెలో కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం కిర‌ణ్ కలికిరికి వచ్చినట్లు సమాచారం. తన సొంత ఊరు కలికిరిలో అందరినీ పలకరించిన ఆయన ‘త్వరలో వస్తా.. అందరితో కలుస్తా.. అందుబాటులో ఉంటా.. అప్పుడు అందరం కూర్చోని మాట్లాడుకుందాం’ అని చెప్పారని సమాచారం. అనంతరం ఆయన కలికిరి నుంచి రోడ్డు మార్గంలో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. దాంతో కిర‌ణ్ కుమార్ రెడ్డి మళ్ళీ రాజ‌కీయాల్లో త‌న హ‌వాని కొన‌సాగిస్తార‌నే టాక్ వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement