Tuesday, November 19, 2024

Story : ఆషాఢ‌మాసంలో గోరింటాకు-ప్ర‌యోజ‌నాలు ఏంటో తెలుసా

గోరింటాకు ఇప్పుడంటే కోన్లు..రెడీమేడ్ లు వ‌చ్చాయి ..కానీ అప్ప‌ట్లో ఎంచ‌క్కా గోరింటాకుని ఏరి తెచ్చుకుని రోటిలో రుబ్బుకుని మ‌రీ పెట్టుకునేవారు ఆడ‌పిల్ల‌లు. ఇప్పుడంత టైం లేద‌నుకోండి. అయితే ఈ గోరింటాకుకి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఎటువంటి శుభ‌కార్యంలోనైనా ముందుండేది ఈ గోరింటాకే. మ‌రీ ముఖ్యంగా ఆషాఢ‌మాసం వ‌చ్చిందంటే చాలు ఆడ‌బిడ్డ‌లు త‌మ చేతుల‌కు గోరింటాకు పెట్టుకుంటుంటారు. అయితే, ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవ‌డం వెనుక పెద్ద కార‌ణ‌మే ఉంది. మ‌హిళ‌లు గోరింటాకు పెట్టుకోవ‌డం వెనుక ఒక ప్ర‌యోజ‌న‌మే ఉంది. సాధార‌ణంగా ఆషాఢమాసంలో వ‌ర్షాలు ప‌డుతుంటాయి. దీంతో సూక్ష్మ‌జీవులు, అంటువ్యాధులు పెరిగే అవ‌కాశం ఉంటుంది. కాగా మ‌హిళ‌లు ఎక్కువ‌గా నీటితో ప‌నిచేస్తుంటారు. కాబ‌ట్టి వారి చేతులు, కాళ్లు ఎప్పుడూ త‌డిగానే ఉంటాయి. దీనివ‌ల్ల వాళ్లు తొంద‌ర‌గా వ్యాధుల బారిన ప‌డే అవ‌కాశం ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే అనారోగ్యం బారిన ప‌డ‌కుండా ఉండొచ్చ‌ని ఆయుర్వేదం చెబుతోంది.

స్త్రీ అర‌చేతి మ‌ధ్య‌లో గ‌ర్భాశ‌యానికి ర‌క్తం చేర‌వేసే ప్ర‌ధాన నాడులు ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవ‌డం వ‌ల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. దీనివ‌ల్ల గ‌ర్భాశ‌య దోషాలు తొల‌గుతాయ‌ట‌. ఇక గోరింటాకు గౌరీదేవి ప్ర‌తీక. గౌరి ఇంటి ఆకు.. గోరింటాకుగా మారింద‌ని మ‌న పురాణాలు చెబుతున్నాయి. గోరింటాకు పుట్టుక వెనుక ఒక క‌థ ఎక్కువ‌గా ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే.. గౌరీ దేవి బాల్యంలో త‌న చెలిక‌త్తెల‌తో క‌లిసి వ‌నంలో ఆట‌లాడే స‌మ‌యంలో ర‌జ‌స్వ‌ల అవుతుంది. ఆ స‌మ‌యంలో గౌరీ దేవి ర‌క్త‌పు చుక్క నేల‌ను తాక‌గానే ఓ మొక్క‌గా ఉద్భ‌వించింది. ఆ వింత‌ను చూసిన చెలిక‌త్తెలు పరిగెత్తుకుంటూ వెళ్లి ప‌ర్వ‌త‌రాజుకు ఈ విష‌యం చెబుతారు. స‌తీస‌మేతంగా ప‌ర్వ‌త‌రాజు.. వ‌నానికి వ‌చ్చేస‌రికి ఆ మొక్క పెరిగి పెద్ద చెట్టు అవుతుంది. అప్పుడు ఆ చెట్టు సాక్షాత్తు పార్వ‌తి రుధిరాంశ‌తో జ‌న్మించాను. నా వ‌ల్ల ఈ లోకంలో ఏదైనా ఉప‌యోగం ఉందా అని అడుగుతుంది. అప్పుడు గౌరీ దేవి చిన్న పిల్ల‌ల చేష్ట‌ల‌తో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆ ఆకు త‌గ‌ల‌గానే గౌరీదేవి వేళ్లు ఎర్ర‌బ‌డిపోతాయి. అది చూసిన ప‌ర్వ‌త‌రాజు దంప‌తులు.. అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందే అని విచారం వ్య‌క్తం చేసేలోపే.. గౌరీదేవి త‌న‌కు ఎలాంటి హాని క‌ల‌గ‌లేద‌ని చెబుతుంది. పైగా ఈ రంగు చాలా అలంకారంగా అనిపిస్తుంద‌ని అంటుంది. అప్పుడు ప‌ర్వ‌త‌రాజు ఉండి.. ఇక‌పై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నాంగా ఈ గోరింటాకు భూలోకంలో ప్ర‌సిద్ధి చెందుతుంద‌ని చెప్పార‌ట‌. స్త్రీల గ‌ర్భాశ‌య దోషాల‌ను తొల‌గిస్తుంద‌ని చెప్పార‌ట‌. ఈ గోరింటాకుని ఆడ‌వారు ఎంతో ముచ్చ‌ట‌ప‌డి పెట్టుకుంటారు. ఇది సంప్ర‌దాయ‌మే కాదు..ఆరోగ్యం కూడా.

Advertisement

తాజా వార్తలు

Advertisement