Friday, November 22, 2024

Story : అగ్నిప‌థ్ తో దేశ‌మంత‌టా నిర‌స‌న జ్వాల‌లు – కేంద్రం వెన‌క్కి త‌గ్గేనా- ఈ స్కీంని వ‌ద్ద‌న‌డానికి కార‌ణమేంటీ..!

అగ్నిప‌థ్ స్కీంతో దేశ‌మంత‌టా నిర‌స‌న జ్వాల‌లు చెల‌రేగాయి. ఈ స్కీంని నిలిపివేయాల‌ని ..ఇది ఆమోద్య‌దాయ‌కం కాద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అగ్నిప‌థ్ స్కీం.. ఈ స్కీం ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోనూ నియామకాలు చేపడుతామని కేంద్ర ప్ర‌భుత్వం ప్రకటించింది. ఈ స్కీం ద్వారా నియామకమైన వారిని అగ్నివీర్లుగా పిలుస్తామన్నారు. ఈ స్కీం కింద రిక్రూట్ అయిన అగ్నివీరులు నాలుగేళ్లు షార్ట్ సర్వీస్ మాత్రమే చేస్తారు. ఆ తర్వాత రిటైర్‌మెంట్ తీసుకుంటారు. అయితే, నాలుగేళ్ల తర్వాత అందరినీ ఇంటికి పంపరు. ఆర్మీలో లాంగ్ టర్మ్ సర్వీస్ చేయాలని స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్నవారిని పరీక్షించి నియమిత సంఖ్యలో చేర్చుకుంటారు. ఈ స్కీం ప్రకటించిన ఒకట్రెండు రోజుల్లో కొన్ని రాష్ట్రాలు అగ్నిగుండం అయ్యాయి. ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలు చేశారు. రోడ్లును దిగ్బంధించడం, వాహనాలను ధ్వంసం చేయడం, ట్రైన్‌లకు నిప్పు పెట్ట‌డం చేశారు. ఈ ఆందోళనలు హింసాత్మకం కావడంతో కొందరు మరణించడం బాధాక‌రం.

అస‌లు ఈ అగ్నిప‌థ్ కోసం ఇంత‌టి హింసాత్మక ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి.. అగ్నిపథ్ స్కీంపై అభ్యర్థులకు ఉన్న అసంతృప్తి ఏంటీ..అగ్నిపథ్ పథకం గురించి నిరసనకారుల నుంచి వినిపిస్తున్న ప్రధానమైన అసంతృప్తిక‌ర‌మైన వ్యాఖ్యలు రెండు. ఒకటి ఉద్యోగ భద్రత. రెండోది పెన్షన్లు. అగ్నిపథ్ స్కీంకు ముందు రిక్రూట్‌మెంట్ చేసుకున్న వారికి 17 ఏళ్ల సర్వీసు ఉండేది. అందులోనూ కొందరు తమ సర్వీసు వ్యవధిని మరికొంత పెంచుకోవడానికి వెసులుబాటు ఉండేది. వీరికి జీవితాంతం పెన్షన్ లభించేది. కొత్త స్కీం ప్రకారం, అగ్నివీర్లు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉద్యోగాలు చేస్తారు. ఆ తర్వాత చాలా మంది అగ్నివీర్లు రిటైర్ కావాల్సిందే. వారికి పెన్షన్లు ఉండవు. గతంలో తాము ఆర్మీ ఉద్యోగాల కోసం నాలుగు.. ఐదు సంవత్సరాలు కష్టపడేవార‌మ‌ని నిరసనకారులు తెలిపారు. తద్వారా ఉద్యోగం పొంది రిటైర్ అయ్యాక జీవితాంతం పెన్షన్లు కూడా వచ్చేవి. తమ ప్రిపేరేషన్‌కు కేటాయించిన సమయం కూడా తమ ఉద్యోగానికి ఉండకుంటే ఎలా అని నిలదీస్తున్నారు. అది కూడా నాలుగేళ్ల తర్వాత మళ్లీ నిరుద్యోగిగా బయటకు రావాల్సి ఉండ‌టం మైన‌స్ అనే చెప్పాలి.

కరోనా కారణంగా రెండేళ్లు ఆర్మీ రిక్రూట్‌మెంట్ నిలిచిపోయింది. ఈ కాలంలో ఆర్మీలోకి వెళ్లాలని అనుకున్నవారు ఏజ్ బార్ అయింది. అంటే వయో పరిమితిని దాటారు. వారు వయోపరిమితిని రెండేళ్లు తమకు పెంచుతారనే ఆశలో ఉన్నారు. కానీ, అగ్నిపథ్ స్కీంతో ఆ వయోపరిమితి అంతే ఉంచారు. ఇది కూడా చాలా మంది అభ్యర్థులకు ఆగ్రహానికి తెప్పించింది.తాజాగా కేంద్రం అగ్నిపథ్ స్కీం కింద వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు అంటే రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. రెండేళ్లు రిక్రూట్‌మెంట్లు చేపట్టకుండా తాజాగా, నాలుగేళ్ల ఉద్యోగం మాత్రమే అని చేసిన ప్రకటన కూడా వారి ఆగ్రహానికి కారణం అయినట్టుగా వారు చెబుతున్నారు. అంతేకాదు, ఆర్మీలో చేరాలని కలలు కనేవారికీ ఈ స్కీం నచ్చడం లేదని, నాలుగేళ్లతోనే తమ కలలు కల‌లుగానే మిగులుతాయ‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. దాంతో నిరుద్యోగుల్లో ఎక్క‌డా లేని నిరాశ‌ల మ‌ధ్య చెల‌రేగిన ఆవేశంతో విధ్వంస‌క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. మ‌రి కేంద్రం ఇప్ప‌టికైనా త‌న ధోర‌ణిని మార్చుకుంటుందో లేక మొండిగా ముందుకు వెళ్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement