Friday, November 22, 2024

Breaking | ఈదురుగాలులు, భారీ వ‌ర్షం.. హైద‌రాబాద్ రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం

హైదరాబాద్‌ సహా తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇవ్వాల (ఆదివారం) రాత్రి ఈదురుగాలులతో వర్షం కురిసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వానలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ఇదివ‌ర‌కే తెలిపింది. కాగా, కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్‌, బాచుపల్లి, నిజాంపేట, హైదర్‌నగర్‌, సుచిత్ర, సూరారంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వికారాబాద్‌ జిల్లాలో వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మెదక్‌ జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షం ప‌డుతోంది. చిన్నశంకరంపేట, చేగుంట, తుప్రాన్‌, మనోహరాబాద్‌లో ఈదురుగాలులతో వర్షం కురుస్తున్నది.

జగిత్యాల జిల్లావ్యాప్తంగా భారీ వర్షంపడుతుంది. పలు కేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో జల్లులు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది. వరంగల్‌, మహబూబాబాద్‌, కామారెడ్డి, జనగామ, హనుమకొండ జిల్లాలు, నిజామాబాద్‌ జిల్లాలో సిరికొండ, ధర్పల్లి, డిచ్‌పల్లి, ఇందల్వాయి మండల్లాలో వర్షం కురుస్తున్నది. ఇదిలా ఉండగా.. రాగల ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement