Wednesday, November 20, 2024

అత్యాచారాలు ఆపండి.. కేన్స్‌లో అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో క‌ల‌క‌లం సృష్టించిన ఉక్రెయిన్‌ మ‌హిళ‌

కేన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సినీ వేడుకలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌ యుద్ధం పేరుతో అక్కడి మహిళలపై రష్యా సైనికులు సాగిస్తున్న అకృత్యాలను నిరసిస్తూ ఓ మహిళ కేన్స్‌లో ఆందోళనకు దిగింది. రెడ్‌ కార్పెట్‌పై ఒక్కసారిగా దుస్తులు చించేసుకుని అర్థనగ్నంగా నిరసన చేపట్టింది. ఈ అనూహ్య పరిణామంతో అంతా ఉలిక్కిపడ్డారు. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భాగంగా శుక్రవారం త్రి థౌజెండ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ లాంగింగ్‌ సినిమా ప్రీమియర్‌ జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఎర్ర తివాచీపై నిలబడి ఫొటోలకు పోజులిస్తుండగా.. ఈ మహిళ అక్కడికి వచ్చింది. రెడ్‌ కార్పెట్‌ ఉన్న మెట్టపైకి వచ్చి తన దుస్తులను చించేసుకుంది. ఆమె ఛాతీ భాగంపై స్టాప్‌ రేపింగ్‌ అనే నినాదం రాసి ఉంది. మమ్మల్ని రేప్‌ చేవద్దంటూ నినాదాలు చేయడం ప్రారంభించింది.

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెకు బట్టలు కప్పి పక్కకు తీసుకెళ్లారు. అయితే ఆమె ఎవరన్నది వెంటనే తెలియరాలేదు. ఉక్రెయిన్‌ మహిళ కావచ్చునని ఊహిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో మహిళలు,చిన్నారులపై ఎన్నెన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. రష్యన్‌ సైనికులు ఉక్రెయిన్‌ మహిళలను, బాలికలను చెరపట్టి అత్యాచారాలు చేస్తున్నారు. ఎన్నెన్నో యుద్ధ నేరాలు అక్కడ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దారుణాలపై దర్యప్తు జరపాలని ఉక్రెయిన్‌ అద్యక్షుడు జెలెన్‌స్కీ డిమాండ్‌ చేస్తున్నారు. కేన్స్‌ ఫిలింఫెస్టివల్‌ ప్రారంభోత్సవం సమయంలో జెలెన్‌స్కీ కూడా ప్రసంగించారు. యుద్ధం కోరల్లో చిక్కుకొని విలవిలాడుతున్న ఉక్రెయిన్‌కు సినిమా ప్రపంచం అండగా నిలబడాలని అభ్యర్థించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement