Saturday, November 23, 2024

TS | రాజకీయాలు మాని.. రైతులను ఆదుకోండి : హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి గేట్లు తెరవాల్సింది రాజకీయ పార్టీల కోసం కాదని, రైతుల కోసం అన్నారు. రైతుల మరణాలకు కాంగ్రెస్సే కారణమన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ధరావత్ తండా గ్రామ పరిధిలోని ఎండిన పంటలను హరీశ్ రావు పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులను ఆదుకోకపోతే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేసిన ఆయన.. కాల్వలు రాకపోవడంతో నీరు లేక కొత్త బోర్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వేసిన బోర్లలో కూడా నీరు పడలేదని అప్పుల పాలయ్యామని, రైతుబంధు కూడా పడడం లేదని రైతులు అంటున్నారని హరీశ్ రావు తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీరు సమృద్ధిగా అందించి పంటలు సమృద్ధిగా పండేవన్నారు. సీఎం రేవంత్, మంత్రులు హైదరాబాద్ లో రాజకీయాలు మానుకొని గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు.

రైతులను మోసం చేశారు..

గోదావరి నదిలో నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతులకు అందించలేక చేతులెత్తేసిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ‘ఆరు గ్యారంటీల్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదు. రైతులను, రైతు కూలీలను, కౌలు రైతులను మోసం చేసింది. డిసెంబర్ 9న రూ.2 లక్షల మాఫీ చేస్తామని హామీ ఇచ్చి వంద రోజులు దాటినా నెరవేర్చలేదు. రైతుబంధు కింద రూ.15 వేలు ఇస్తామని మోసం చేశారు. గతంలో మేమిచ్చిన రూ.10 వేలు కూడా ఇవ్వడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

కాంగ్రెస్ వచ్చాక నీళ్లు లేవు, కరెంటు లేదు. మోటార్లు కాలిపోతున్నయి. ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నయి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. వడగండ్ల వానలో లక్షలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది. అయినా సీఎం రైతులను పరామర్శించిన పాపాన పోలేదు. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే అన్నదాతలు ఆత్మస్థైర్యం కోల్పోతారు. కాంగ్రెస్ హామీ ప్రకారం వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొనాలి. బోనస్ ఇవ్వకుండా పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్‌కు లేదు. ప్రభుత్వం ఆదుకోకపోతే భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం.’ అని హరీష్ రావు పేర్కొన్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement