కేరళ లోని కాసర్‌గోడ్ నుంచి తిరువనంతపురం వెళుతున్న వందే భారత్ రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు మరోసారి రాళ్లతో దాడి చేశారని కేరళ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రైలు అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రైలు వాలపట్టణం-కన్నూర్ మధ్య ఉండగా మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దాడి జరిగినట్లు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు.
ఈ ఘటనపై రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేరళలో రెండు వారాల వ్యవధిలో ఇది రెండో ఘటన. ఏప్రిల్ 25న ప్రధాని మోడి తిరువనంతపురం-కాసరగోడ్ మధ్య వందే భారత్ రైలును ప్రారంభించారు. తర్వాతి వారంలోనే రైలు తిరునవయ-తిరూర్ మధ్య ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కోచ్ అద్దం ధ్వంసమైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు