Friday, November 22, 2024

దేశంలోనే తొలిసారిగా ‘స్టోలెన్ ప్రాపర్టీ రిలీజ్ మేళా’

హైదరాబాద్ నగర పరిధిలోని సైబరాబాద్ పోలీసులు దేశంలోనే తొలిసారిగా ప్రాపర్టీ రిలీజ్ మేళా నిర్వహించారు. అంటే ఏదైనా చోరీ కేసులో బాధితులు పోగొట్టుకున్న సొమ్మును పోలీసులు రికవరీ చేసినా ఆ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంటుంది కాబట్టి కోర్టు అనుమతి ఇచ్చేదాకా బాధితులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో బాధితులు తమ సొమ్ము రికవరీ అయినందుకు సంతోషపడాలో.. లేకపోతే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోందని బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొని ఉంటుంది.

ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ బృహత్తరమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సైబరాబాద్‌ క్రైమ్స్‌ టీమ్‌, సీసీఆర్‌బీ, కోర్టు మానిటరింగ్‌ సిబ్బందితో సమావేశమై ప్రాపర్టీ రిలీజ్‌ మేళా అనే కొత్త కార్యక్రమం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కమిషనరేట్‌ పరిధిలోని 36 పోలీస్‌ స్టేషన్‌లను ఏకం చేశారు. కమిషనరేట్‌ పరిధిలోని 3 జిల్లాల న్యాయమూర్తులతో మాట్లాడి కోర్టు ప్రాసెస్‌, ఇతర ప్రొసీడింగ్స్‌ అన్నీ పోలీసులే చూసుకునేలా చేశారు. కోర్టు అనుమతితో రికవరీ అయిన సొత్తును బాధితులకు అందజేసేలా ప్రణాళికలు రూపొందించారు. మంగళవారం సైబరాబాద్‌ కమిషనరేట్‌ మైదానంలో స్టోలెన్‌ ప్రాపర్టీ రిలీజ్‌ మేళా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. శంషాబాద్‌, మాదాపూర్‌, బాలానగర్‌ జోన్‌ల పరిధిలో మొత్తం 176 కేసులను ఛేదించారు. ఆయా కేసుల్లో రికవరీ చేసిన రూ. 1.50కోట్ల విలువైన సొత్తును సీపీ సజ్జనార్‌ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు.

ఈ వార్త కూడా చదవండి: కర్ణాటక 20వ సీఎంగా బొమ్మై ప్రమాణస్వీకారం

Advertisement

తాజా వార్తలు

Advertisement