Friday, November 22, 2024

Follow up | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. నష్టం 380 నుంచి 124 లాభంతో ముగింపు

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, చమురు షేర్లకు చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉండటంతో ప్రారంభ ట్రేడింగ్‌లో నీరసపడ్డ సూచీలు, చివర్లో పుంజుకుని లాభాల్లో ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు తగ్గి 81.95 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.16 శాతం నష్టంతో 83.16 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై, సియోల్‌, హాంకాంగ్‌, నష్టపోగా, టోక్యో రాణించింది. ఐరోపా సూచీలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 59,916.10 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు నష్టాల్లోనే కదలాడిన సూచీ, ఇంట్రాడేలో 380 పాయింట్ల నష్టంతో 59,844.82 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. ఆఖర్లో పరుగులు తీసి, 123.63 పాయింట్ల లాభంతో 60,348.09 వద్ద ముగిసింది. నిష్టీ 42.95 పాయింట్లు పెరిగి 17,754.40 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,602.25 – 17,766.50 పాయింట్ల మధ్య కదలాడింది.

- Advertisement -

సెన్సెక్స్‌ 30 షేర్లలో 17 లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 4.75 శాతం. ఎం అండ్‌ ఎం 1.61 శాతం, ఎల్‌ అండ్‌ టీ 1.37 శాతం, ఎన్‌టీపీసీ 1.10 శాతం, ఐటీసీ 1.06 శాతం చొప్పున రాణించాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 2.30 శాతం, టెక్‌ మహీంద్రా 1.14 శాతం, ఇన్ఫోసిస్‌ 1 శాతం నష్టపోయాయి.

నెల రోజుల గరిష్టానికి అదానీ షేర్లు : రూ. 7,374 కోట్ల తనఖా రుణాలను ముందే చెల్లించడంతో వరుసగా ఆరో రోజూ రాణించిన అదానీ షేర్లు నెల రోజుల గరిష్టానికి చేరాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 2.86 శాతం లాభపడి రూ.2039.65 శాతం వద్ద ముగిసింది. అదానీ పవర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ టోటల్‌ గ్యాస్‌ 5 శాతం చొప్పున దూసుకెళ్లిd అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. అదానీ పోర్ట్స్‌ 3.22 శాతం, ఎన్‌డీటీవీ 4.94 శాతం, అంబుజా సిమెంట్స్‌ 1.69 శాతం, ఏసీసీ 1.03 శాతం మేర రాణించాయి.

అదానీ గ్రూప్‌లో జీక్యూజీ మరిన్ని పెట్టుబడులు : అదానీ గ్రూప్‌లో మరిన్ని పెట్టుబడులు పెడతామని అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జీక్యూజీ పార్టనర్స్‌ వ్యవస్థాపకుడు రాజీవ్‌ జైన్‌ వెల్లడించారు. మరిన్ని పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులపై ప్రతికూల ఆధారంగా ముందుకు వెళ్తామని జైన్‌ వివరించారు. అదానీ గ్రూప్‌కు చెందిన 4 నమోదిత సంస్థల్లో మైనార్టీ వాటాలను జీక్యూజీ పార్టనర్స్‌ రూ.15,446 కోట్లకు గతవారం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అదానీ కంపెనీల్లో వాటాల కొనుగోలుపై పెట్టుబడిదార్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఆస్ట్రేలియా వెళ్లారు.

దివాలా ప్రక్రియకు ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ : రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ దివాలా ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీ అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన మరో సంస్థ ఫ్యూచర్‌ రిటైల్‌ దివాలా ప్రక్రియ ఎదుర్కొంటోంది. కంపెనీ కొనుగోలుకు విజయవంతమైన బిడ్డర్‌ దొరికేంత వరకు కార్యకలాపాల నిర్వహణ కోసం పరిష్కార నిపుణుడిని ఎన్‌సీఎల్‌టీ నియమించింది.
బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా కంపెనీలో 17.71 శాతం వాటాను రూ.825 కోట్లకు కిర్లోస్కర్‌ అయిల్‌ ఇంజిన్స్‌ ప్రమోటర్‌ సంస్థలు విక్రయించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement