ముంబై : స్టాక్‌మార్కెట్లు బుధవారం నాడు భారీ నష్టాల్లో ముగిశాయి. సూచీలపై బేర్ పట్టుబిగించింది. వరసగా నాలుగు రోజులుగా మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాయ మార్కెట్లలో నెగిటివ్ సెంటిమెంట్ మధ్య ఉదయం బలహీనంగా ప్రారంభమైన మార్కెట్లు ఒక దశలో 950కి పైగా పాయింట్లు నష్టపోయింది. ఫిబ్రవరిలో ద్వైమాసిక పరపతి విధాన సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను ఇటు ఆర్‌బీఐతో పాటు, ఫెడ్ కూడా బుధవారం నాడు విడుదల చేశాయి. రిటైల్ ద్రవ్యోల్బోణం భారత్‌లో 6.5 శాతానికి, అమెరికాలో 6.4 శాతానికి చేరింది. దీంతో వడ్డీ రేట్లు పెంపు ప్రక్రియ మరికొంత కాలం ఉంటుందన్న అంచనాలు మార్కెట్లను దెబ్బతీశాయి. అదానీ గ్రూప్‌పై వికీపీడియా చేసిన ఆరోపణలతో అదానీ కంపెనీల షేర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ అత్యధికంగా 11.02 శాతం నష్టపోయింది. దీంతో పాటు దిగ్గజ కంపెనీల షేర్లు నష్టపోవడంతో సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి.
బుధవారం ఒక్క రోజే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ 3.5 లక్షల కోట్లకు పైగా కరిగిపోయింది. సాధారణంగా దీన్ని ఇన్వెస్టర్ల సంపదగా పరిగణిస్తారు. సెన్సెక్స్ 927.74 పాయింట్లు నష్టపోయి 59744.98 వద్ద ముగిసింది. నిఫ్టీ 272.40 పాయింట్లు నష్టపోయి 17554.30 వద్ద ముగిసింది.
బంగారం 10 గ్రాముల ధర 42 రూపాయలు పెరిగి 56210 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 158 రూపాయలు తగ్గి 65894 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.71 రూపాయలుగా ఉంది.
లాభపడిన షేర్లు
ఐటీసీ, బజాజ్ ఆటో, దివిస్ ల్యాబ్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు
బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్,
రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, విప్రో, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్ కంపెనీ, టీసీఎస్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, హిందూస్థాన్ యూనిలీవర్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఓఎన్‌జీసీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టపోయాయి.