దేశీయ స్టాక్ మార్కెట్‌లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్‌లలో ప్రతికూల సంకేతాలతోపాటు కొవిడ్ భయాలు కూడా సూచీలపై ప్రధానంగా ప్రభావం చూపుతున్నాయి.కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాలు కూడా సూచీలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిసిన నేపథ్యంలో ఆసియా మార్కెట్లు ఈ రోజు (సోమవారం) అప్రమత్తంగా కదలాడుతున్నాయి.
సోమవారం ఉదయం 10.00 గంటల సమయంలో సెన్సెక్స్ 350 పాయింట్లు నష్టపోయి 48,431 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 80 పాయింట్లు కోల్పోయి 14,550 వద్ద కొనసాగుతున్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 74.89 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ఉన్నాయి. సిప్లా, ఓఎన్‌జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ భారత్ పెట్రోలియం, బజాజ్ ఆటో స్వల్ప లాభాల్లో పయనిస్తుండగా.. ఎస్‌బీఐ, బజాజ్ ఫినాన్స్, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి.