Thursday, November 21, 2024

అమర్‌నాథ్‌ యాత్ర పునరుద్ధరణ దిశగా అడుగులు.. సహాయక చర్యలు వేగవంతం

మెరుపు వరదల కారణంగా నిలిపివేసిన అమర్‌నాథ్‌ యాత్రను వీలైనంత వేగంగా పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం నాటి కుంభవృష్టి, మెరుపు వరదల కారణంగా అమర్‌నాధ్‌ గుహ సమీపంలోని యాత్రికుల శిబిరాలు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 16 మంది మరణించిన విషయం తెలిసిందే. మరో 40 మంది గల్లంతుకాగా ఇప్పటివరకు వారి ఆచూకీ లభ్యం కాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన 21మందికి చికిత్సకోసం తరలించారు. మరోవైపు గుహలోని అమర్‌నాధుడి మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు వచ్చి వరదల్లో చిక్కుకుపోయిన 15వేలమందిని దిగువనున్న బేస్‌ క్యాంప్‌కు తరలించారు. కాగా ప్రస్తుతం అమర్‌నాథ్‌ గుహకు చేరుకునే మార్గాల్లో పేరుకుపోయిన బురద, రాళ్లను తొలగిస్తున్నారు. యాత్రికులు బస చేయడానికి, దర్శనం చేసుకోవడానికి అవసరమైన వసతి సౌకర్యాలు పునరుద్ధరిస్తున్నామని జమ్మూకాశ్మీర్‌ ఉన్నతాధికారులు ఆదివారంనాడు ప్రకటించారు.

కాగా అమర్‌నాధ్‌కు చేరుకునే ప్రధాన మార్గం పహల్గామ్‌లోని నున్వాన్‌ బేస్‌ క్యాంప్‌ను జమ్మూకాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా సందర్శించారు. ఆ మార్గంలో దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని, సహాయక చర్యల్లో శక్తివంచన లేకుండా పనిచేస్తున్న సైనిక బలగాలు, ఇటో టిబెటెన్‌ బోర్డర్‌ పోలీస్‌, అధికార యంత్రాంగాన్ని ఆయన ప్రశంసించారు. వాతావరణం మెరుగపడటం, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో అతి త్వరలోనే యాత్ర పున:ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కాగా కేంద్ర విపత్తుల నిర్వహణ సంస్థకు చెందిన మూడు బృందాలు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమైనాయి. 43 రోజులపాటు సాగే అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 30న ప్రారంభం కాగా ఆగస్టు 11న రక్షాబంధన్‌ పర్వదినం నాడు ముగుస్తుంది. కాగా రెండేళ్ల తర్వాత మళ్లిd ఈ ఏడాది యాత్రకు అనుమతి ఇవ్వగా ఇప్పటికి రెండుసార్లు అంతరాయం ఏర్పడింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement