Monday, November 25, 2024

విశాఖ పోర్టు కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి : జీవీఎల్ నరసింహారావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నం పోర్టులో జరుగుతున్న ఎగుమతులు, దిగుమతుల కారణంగా ఏర్పడుతున్న వాయు కాలుష్యాన్ని నివారించడంపై చర్యలు చేపట్టాలని బీజేపీ ఎంపీ (రాజ్యసభ) జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం రాజ్యసభలో స్పెషల్ మెన్షన్ ద్వారా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి అనేక సూచనలు చేశారు. విశాఖ పోర్టులో 70 మిలియన్ టన్నుల బొగ్గు, ఐరన్ ఓర్, పెట్ కోక్, కోక్ వంటి ఖనిజాల ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయని, తద్వారా ఆ ఖనిజాల ధూళి ఉద్గారాలు వాయు కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయని అన్నారు. కోకింగ్ బొగ్గు, ఆవిరి బొగ్గుతో పాటు ఇతర అన్ని రకాల కార్యకలాపాల ద్వారా ఏర్పడుతున్న వాయు కాలుష్యం విశాఖ, పరిసర ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుందని తెలిపారు. అనేక దశాబ్దాల క్రితం విశాఖపట్నం నౌకాశ్రయం ప్రారంభమైందని, కాలక్రమంలో నౌకాశ్రయం చుట్టూ నివాసాలు విపరీతంగా పెరిగాయని, వారిని వాయు కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు పోర్టులో మూసేసిన భారీ షెడ్లను మళ్లీ వినియోగంలోకి తీసుకొచ్చి కార్గోను నిల్వచేయాలని సూచించారు.

షెడ్ల నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకోవడం, పెట్టుబడి ఎక్కువగా పెట్టల్సిరావడం, తిరిగి వసూలు చేసుకునే కాలం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ప్రైవేట్ బెర్త్ ఆపరేటర్లు ఈ పనులు చేపట్టలేరని తెలిపారు. అందుకే కేంద్ర జలమార్గాల మంత్రిత్వ శాఖ ‘సాగర్ మాల’ ప్రాజెక్ట్ కింద ఈ పెట్టుబడిని సమకూర్చాలని, ఆ తర్వాత యూజర్ ఛార్జీలను వసూలు చేయడం ద్వారా పెట్టుబడిని తిరిగి పొందవచ్చని జీవీఎల్ ప్రతిపాదించారు. కాలుష్యకారక ఉద్గారాలను అరికట్టడానికి కోకింగ్ బొగ్గు, ఆవిరి బొగ్గు వంటివాటిని కవర్ షెడ్ల పరిధిలోకి తీసుకొచ్చేందుకు నిర్ణీత కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించాలని జీవీఎల్ సూచించారు.

- Advertisement -

ఈ క్రమంలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (వీపీఏ) ఇప్పటికే 2 షెడ్ల నిర్మాణాన్ని ప్రారంభించిందని, మరో రెండు షెడ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ, భారీ సామర్థ్యం, అత్యాధునికమైనషెడ్లను స్టాకర్ రీక్లెయిమర్లు లేదా వ్యాగన్ లోడింగ్ వ్యవస్థలతో నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజారోగ్యం, ఓడరేవు కార్యకలాపాల సుస్థిరత దృష్ట్యా ఈ సమస్యను అత్యవసరంగా పరిశీలించి బాగా అమర్చిన కవర్ షెడ్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని జీవీఎల్ అభ్యర్థించారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేసిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం ప్రజల ప్రజారోగ్యానికి హాని కలిగించే సమస్యల పరిష్కారం కోసం తాను ఏస్థాయిలోనైనా ప్రయత్నిస్తానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement