ప్రభన్యూస్, ఉమ్మడి రంగారెడ్డి : చిన్నపాటి ఇళ్లు కట్టుకోవాలని మధ్యతరగతి వర్గాల ప్రజల ఆశలు ఆశలుగానే మిగిలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.. రంగారెడ్డి జిల్లాలో 6777 ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. ఇందులో 2500 ఇళ్లు చివరి దశకు చేరుకున్నాయి. వీటికి రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, నీటి వసతులు కల్పిస్తే డబుల్‌బెడ్‌రూం ఇళ్లు అర్హులైన వారికి పంపిణీ చేయవచ్చు. కానీ కనీస సౌకర్యాలు కల్పించేందుకు నిధులు లేకపోవడంతో నెలలుగా అలాగే ఉండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను చాలా ప్రాంతాల్లో చేపట్టలేదు. దీంతో చాలామంది నిరుపేదలు తాము సొంతంగానే ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. పెరిగిన ధరలతో నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. రోజురోజుకు స్టీలు, సిమెంట్ ధరలు పెరిగిపోతుండటంతో నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరిగిన ధరలతో ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలంటే అదనంగా అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
గతసారితో పోలిస్తే భారీగా పెరిగిన ధరలు..
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోని శివార్లలో అపార్టుమెంట్లు, విల్లాలు, ఇళ్లకు మంచి డిమాండ్ ఉంది. కానీ స్టీలు, సిమెంట్ ధరలు పెరిగిపోతుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. పెద్దపెద్ద నిర్మాణ సంస్థలకు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా మధ్యతరగతి వర్గాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం స్టీలు టన్నుకు రూ.84వేలు పలుకుతోంది.. సిమెంట్ బస్తా రూ.380 నుంచి రూ.400 వరకు పలుకుతోంది. గతఏడాది స్టీలు టన్నుకు రూ.60వేల వరకు ధర పలికింది.. ఈసారి మాత్రం ఏకంగా టన్నుకు రూ.24వేల వరకు పెరిగింది. సిమెంట్‌కు కూడా అదే పరిస్థితి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..