హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయుల బదిలీలపై స్టేను తెలంగాణ హైకోర్టు ఈనెల 26 వరకు పొడిగించింది. ఎన్నికలు సమీపిస్తున్నందున పిటిషన్లను త్వరగా తేల్చాలని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈమేరకు అన్ని విషయాలను పరిశీలించిన కోర్టు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. బదిలీలకు రూపొందించిన నిబంధనలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్లు హైకోర్టు విచారణ చేపట్టింది.
బదిలీల విషయంలో గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఎం.సక్కుబాయి సహా ఐదుగురు ఉపాధ్యాయులు సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. జీవోలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని, నాన్ స్పౌజ్ టీచర్లకు తీరని అన్యాయం జరిగేలా ఉన్నాయని పిటిషనర్లు తమ వాదను కోర్టు ముందు వినిపిస్తూ వస్తున్నారు. చట్ట ప్రకారం నిబంధనలు రూపొందించే అధికారం అధికారులకు ఉండదని, చట్టసభలకు మాత్రమే ఉంటుందని పేర్కొంటున్నారు.
మరోవైపు బదిలీల నిబంధనలను చట్టసభల అనుమతి పొందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది తమ వాదనలను వినిపిస్తున్నారు. ఈక్రమంలోనే ఈ కేసు విచారణ కోర్టు ముందుకు మంగళవారం రావడంతో ఈ నెల 26 వరకు స్టే పొడిగిస్తూ కేసును వాయిదా వేసింది. ఇదిలా ఉంటే బదిలీలు, పదోన్నతుల కోసం టీచర్లు కొంత కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బదిలీల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందోనని ఎదురుచూస్తున్నారు.