న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో డ్రగ్స్ ప్రభావం అధికంగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో సంబంధిత కేసులు తగ్గుతుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేసులు నానాటికీ పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశంపై మంగళవారం లోక్‌సభలో ఎంపీలు ఎ.గణేశమూర్తి, డా. నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ, ఏ.రాజా అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో అనేకాంశాలు పేర్కొన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ కేసులు 286 నమోదవగా, 2021 నాటికి ఆ సంఖ్య 550 కి పెరిగింది.
అలాగే 2019లో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న వ్యక్తుల అరెస్టులు 905 జరిగితే, 2021 నాటికి అరెస్టుల సంఖ్య 1,469కు చేరుకుంది. తెలంగాణాలో మాదక ద్రవ్యాల సంబంధిత కేసులు 2019లో 219 నమోదవగా, 2021 నాటికి ఆ సంఖ్య 722కు పెరిగింది. 2019లో తెలంగాణాలో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న 428 మందిని అరెస్టు చేయగా, 2021 నాటికి అరెస్టుల సంఖ్య 1,421కు పెరిగిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 ఏళ్ల లోపు పిల్లలతో పాటు 18 ఏళ్లు దాటిన మహిళల్లోనూ మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.