Friday, November 22, 2024

రైలు వేగానికి కుప్పకూలిన రైల్వే స్టేషన్‌ భవనం

మధ్యప్రదే‌శ్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు పెనుప్రమాదం తప్పింది. భూసావల్ రైల్వే డివిజన్ పరిధిలోని బుర్హాన్పూర్‌ రైల్వే స్టేషన్‌ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. స్టేషన్‌ గుండా ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నేపానగర్-అసిగర్ మధ్య బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో పుష్పక్ ఎక్స్‌ప్రెస్ 110 కిలోమీటర్ల వేగంతో స్టేషన్ గుండా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రైలు వేగానికే భవనం కుప్పకూలినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈ తరహా ఘటన జరగడం దేశంలో ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొంటున్నారు. రైలుకు సిగ్నల్‌ ఇచ్చేందుకు ప్లాట్‌ఫాంపైకి వచ్చిన అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ప్రదీప్ పన్వర్ ప్రమాదాన్ని గుర్తించి పరిగెత్తడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఉన్నతాధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. జీఆర్‌పీ సిబ్బంది ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. పుష్పక్‌ రైలును 30 నిమిషాలపాటు రైల్వే స్టేషన్‌లోనే నిలిపివేశారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. లూప్‌ లైన్‌ ద్వారా రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement