Friday, November 22, 2024

Delhi: ఖ‌నిజాలు, గ‌నుల‌పై రాష్ట్రాల‌కే రాయ‌ల్టీ విధించే హ‌క్కు…

కేంద్రానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
పార్ల‌మెంట్ కు గంపగుత్త అధికారాలు ఉండ‌వు
మైనింగ్ ఉన్న రాష్ట్రాల హ‌క్కులూ ఉంటాయి
ఆయా రాష్ట్రాలు రాయ‌ల్టీ విధించ‌డం తప్పు కాదు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – ఖనిజాలు, గనులపై రాష్ట్రాలు రాయల్టీ విధించే విషయంలో సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. ఖనిజాలు, గనులు కలిగిన భూములపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకు ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు 8:1తో విస్తృత ధర్మాసనం నేడు కీలక తీర్పు వెలువరించింది. ఖనిజాలు సమృద్ధిగా కలిగిన ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ్‌ బెంగాల్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ రాష్ట్రాలకు ఈ తీర్పు వల్ల ప్రయోజనం చేకూరనుంది. ఇప్పుడు ఆ రాష్ట్రాలు తమ భూభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న సంస్థలపై అదనంగా మొత్తాన్ని వసూలు చేయడానికి వీలుకలగనుంది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తాజా తీర్పు వెలువరిస్తూ.. రాయల్టీ, ట్యాక్స్ ఒకటి కాదని వ్యాఖ్యానించింది. అయితే తొమ్మిది మంది బెంచ్‌లో ఎనిమిది మంది ఒకే రకమైన తీర్పు ఇవ్వగా.. జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం భిన్నమైన తీర్పు ఇచ్చారు.

- Advertisement -

గనులు, ఖనిజాల నియంత్రణ, అభివృద్ధిపై పార్లమెంటుకు గంపగుత్త అధికారాన్ని రాజ్యాంగం కట్టబెట్టలేదని గత విచారణలో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. రాష్ట్రాలకూ వాటిపై నియంత్రణాధికారం, అభివృద్ధి హక్కులుంటాయని తేల్చి చెప్పింది. ఖనిజాలపై పార్లమెంటుకున్న పన్ను విధించే అధికారం అనేది రాష్ట్రాల నియంత్రణాధికారాన్ని తుడిచిపెట్టేస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1957 (ఎంఎండీఆర్‌) ప్రకారం.. ఖనిజాలపై రాయల్టీని పన్నుగా పేర్కొనవచ్చని, దీనిపై పార్లమెంటుకు గంపగుత్త అధికారముందని మైనింగ్‌ కంపెనీల తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదించారు. దీనిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 1989లో ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌ వర్సెస్‌ తమిళనాడు ప్రభుత్వం కేసులో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. రాయల్టీని పన్నుగా గుర్తించవచ్చని తీర్పు చెప్పింది.

అయితే 2004లో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం వర్సెస్‌ కేశోరాం ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కేసులో తీర్పు చెబుతూ.. 1989 నాటి తీర్పులో అచ్చుతప్పులు దొర్లాయని, రాయల్టీ.. పన్ను కాబోదని స్పష్టంచేసింది. దీంతో రెండు విభిన్నమైన తీర్పులు రాగా.. అప్పట్లో ఈ వివాదాన్ని తొమ్మిది మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి కోర్టు అప్పగించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. మార్చిలో తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా కీలక తీర్పు వెలువరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement