Friday, November 15, 2024

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అమలులోనే ఉంది.. రాజ్యసభలో కేంద్రమంత్రి వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక సహాయచర్య ( ప్రత్యేక ప్యాకేజీ) అమలులో ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 17 ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్‌ల (ఈఏపీ) కోసం రూ.7798 కోట్లు మంజూరు చేసినట్టు రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం 17 ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్‌లకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. పార్లమెంట్‌లో ఇచ్చిన వివిధ హామీలు, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు, కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అవసరాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 2015 మార్చి 15న ఈఏపీ నిధులతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల జాబితాలో విశాఖపట్నం-చెన్నై కారిడార్ ప్రాజెక్ట్ (రూ. 1859 కోట్లు), ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసే ప్రాజెక్ట్ (రూ. 935 కోట్లు), ఆంధ్రప్రదేశ్ పవర్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్ (897 కోట్లు), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్ (825 కోట్లు) ఉన్నాయి.

ప్రత్యేక ప్యాకేజీని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందా అని జీవీఎల్ అడిగిన ప్రశ్నకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని, మే 2వ తేదీ 2017న లేఖ ద్వారా అప్పటి కేంద్ర ఆర్థికమంత్రికి ధన్యవాదాలు కూడా తెలిపారని పంకజ్ చౌదరి గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీలో 100 శాతం కేంద్రప్రభుత్వ నిధులతో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా అమలు చేయడానికి నిర్ణయాలు కూడా తీసుకున్నారని వివరించారు.

9-10 వేల కోట్ల ఆర్థిక సహాయం..

అనంతరం బీజేపీ విప్ జీవీఎల్ నరసింహారావు న్యూఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. 2107 మార్చిలో నాటి సీఎం చంద్రబాబు అభ్యర్ధన మేరకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. 17 ఈఏపీలకు ఆర్ధిక సహాయం అందుతుందని, ఈ మేరకు రూ. 7,798 కోట్లు విదేశీ సంస్థల ద్వారా రుణాలు అందించినట్టు వివరించారు. ప్యాకేజీలో ఒప్పుకున్న ప్రకారం ఈ రుణాలన్నీ కేంద్రమే తిరిగి చెల్లిస్తుంది కాబట్టి ఆ భారం రాష్ట్రంపై పడదని స్పష్టం చేశారు. వడ్డీతో కలుపుకుంటే రూ 9-10 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం ఆంధ్ర ప్రజలకు అందుతోందని ఆయన వివరించారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఇప్పటికే అప్పుల్లోకి నెట్టేసిన పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చిన ఈ ఆర్థిక సహాయం రాష్ట్రానికి లాభమేనని సంతోషం వ్యక్తం చేశారు. 2014 నాటికి ఏపీ అప్పు రూ 97,123.93 కోట్లు కాగా, ఈ మార్చికి రూ 3.98 లక్షల కోట్లకు చేరిందని జీవీఎల్ తెలిపారు. అప్పుల ఊబికి అధికారంలో ఉన్న రెండు పార్టీలు టీడీపీ, వైఎస్సార్సీపీ బాధ్యత వహించాలన్నారు. టీడీపీ హయాంలోనే ఏపీ అప్పు రూ. 2,64,451 కోట్లకు చేరిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతూ కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతో రుణాలు సేకరిస్తున్నట్టు ఆర్బీఐ నివేదికలోనే పేర్కొందని, ఇవి బడ్జెట్ పరిధిలో లేని అప్పులు అని స్పష్టంగా తెలుస్తోందని ఆయన ఆరోపించారు. ఈ తరహాలో చేస్తున్న రుణాలను కూడా రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రుణాల్లో భాగంగానే పరిగణిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసిందన్న జీవీఎల్, ఇలాంటి అప్పులన్నీ కలిపితే ఏపీ అప్పుల మొత్తం రూ 6 లక్షల కోట్లు దాటుతుందా అనిపిస్తోందన్నారు. బడ్జెట్ వెలుపల ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేస్తున్న రాష్ట్రాలను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చులు తగ్గించి, నాన్ మెరిట్ ఉచిత పథకాలను తగ్గించాలని, ఆర్థిక వనరులను బెరీజు వేసుకొని సంక్షేమ పథకాలు అమలు చేయాలని జీవీఎల్ నరసింహారావు హితవు పలికారు. అనవసర ఆర్భాటాలు, వందల సంఖ్యలో సలహాదారులు వంటి దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు.

ఆయుధాల చట్టంపై చర్చను అడ్డుకుంటారా?

- Advertisement -

సభా కార్యక్రమాలకు పదేపదే అడ్డుపడుతున్న 19 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని తెలిపారు. ఎంతో ముఖ్యమైన మారణాయుధాల చట్టంపై చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని, ఉగ్రవాదులకు మారణాయుధాలు అందకుండా చేసే అంశంపై రూపొందిన చట్టం అది అని ఆయన వివరించారు. జూన్ 29న జరిగిన జీఎస్టి కౌన్సిల్ సమావేశానికి ఏపీ తెలంగాణ ఆర్థిక మంత్రులు కూడా హాజరయ్యారని, వారందరూ కలిసి తీసుకున్న నిర్ణయంపై కేవలం బీజేపీని నిందించడం రాజకీయం కాదా? అని జీవీఎల్ ప్రశ్నించారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తెలంగాణ మంత్రి వ్యతిరేకించారా? లేదా? అని నిలదీశారు. హైదరాబాద్ నగరంలో ఉగ్రవాద చర్యలు ఎన్నో జరిగాయని, అలాంటి సందర్భంలో ఉగ్రవాదులకు ఆయుధాలు అందకుండా చేసే చట్టంపై చర్చ జరగకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో టీఆర్ఎస్ ఎంపీలు చెప్పాలని జీవీఎల్ ప్రశ్నించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement