హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర విభజన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం కొత్తఢిల్లిలో అధికారికంగా తొలిసారి నిర్వహించడం, ఈ వేడుకల్లో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొనడం సంతోషకరమన్నారు. అయితే రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయాల్సిన బాధ్యత మంత్రి అమిత్‌షా పై ఉందన్నారు. బుధవారం మంత్రుల నివాసంలో వివిధ మార్కెట్ కమిటీల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో వినోద్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్ళు గడుస్తున్నప్పటికీ ఆ చట్టంలోని అనేక అంశాలు ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే ప్రకటించాలని కేంద్రాన్ని ఆయన కోరారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలను మంజారు చేయాలన్నారు. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ తెలంగాణలో ఐటిఐఆర్ విషయంలో కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు అంశాలను ప్రధాని నరేంద్ర మోడీ పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. మిషన్ భగీరథ, కాకతీయ వంటి పథకాలకు నిధులు ఇవ్వాలని కేంద్రానికి నీతి అయోగ్ సిఫార్సు చేసినా నయాపైసా కూడా మంజారు చేయలేదన్నారు. హైదరాబాద్‌కు మంజూరైన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రాన్ని కుట్రపూరితంగా గుజరాత్‌కు కేంద్రం తరలించిందని ఆయన ఆరోపించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..