న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలు, పోరాట పటిమను చాటిచెప్పేలా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని దేశ రాజధానిలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. గురువారం ఉదయం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.ఎం.సాహ్ని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం సాహ్ని, ఆర్సీ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ విక్రమ్ సింగ్ మాన్‌లతో కలిసి అమర వీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి కూడా పూల మాల వేసి నివాళులర్పించారు. ఆర్సీ గౌరవ్ ఉప్పల్ మీడియాతో మాట్లాడుతూ… ప్రతి ఏడాదిలాగే ఈసారీ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఢిల్లీలోని తెలుగు వారందరూ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సాయంత్రం అంబేద్కర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..