Tuesday, November 26, 2024

అంతరిక్ష రంగంలోకి స్టార్టప్‌లు.. కొత్త టెక్నాలజీల అభివృద్దికి చేయూత

దేశీయ అంకుర సంస్థలు అంతరిక్ష రంగంవైపు దృష్టిసారించాయి. దాదాపు 100 అంకుర సంస్థలు ఇస్రోవద్ద తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. అంతరిక్ష రంగంలోని వివిధ డొమైన్‌లలో ఇస్రోతో కలిసి పనిచేస్తున్నాయి. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ స్వయంగా వెల్లడించారు. గురువారం బెంగళూరు టెక్‌ సమ్మిట్‌ 2022లో ‘ఆర్‌ అండ్‌ డి ఆఫ్‌ ఇండియా-ఇన్నోవేషన్‌ ఫర్‌ గ్లోబల్‌ ఇంపాక్ట్‌’ అనే అంశంపై జరిగిన ప్లీనరీ సెషన్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, అంతరిక్ష సాంకేతికతలో హ్యాండ్‌ #హూల్డింగ్‌తో సహా సన్నిహితంగా పనిచేసేందుకు కంపెనీలతో ఇస్రో అవగాహనా ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసిందని చెప్పారు. ప్రారంభం నుండి ముగింపు వరకు నిర్మాణ ప్రక్రియల్లో స్టార్టప్‌లు భాగస్వామ్యం అవుతున్నాయని తెలిపారు.
గణనీయమైన సంఖ్యలో అంకుర సంస్థలు అంతరిక్ష రంగంలో పెద్ద కంపెనీలుగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, సాంకేతికతలను నిర్మించడంలో ఇస్రో సులభతరం చేసే పాత్రను పోషిస్తోందని అన్నారు. 100 స్టార్టప్‌లలో కనీసం 10 శాటిలైట్‌లు, రాకెట్‌లను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయని చెప్పారు.

చంద్రయాన్‌-3 మిషన్‌ మరికొద్ది నెలల్లో కక్ష్యలోకి ప్రవేశిస్తుందని సోమనాథ్‌ ప్రకటించారు, ఇస్రో అంతరిక్ష సాంకేతిక రంగాలలో నాసాతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. రాకెట్‌లో ఉపయోగించిన కంప్యూటర్‌ను భారత్‌లో తయారు చేసినట్లు తెలిపారు. రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపే వివిధ అప్లికేషన్‌లపై ఆసక్తిని కనబరుస్తున్న స్టార్టప్‌లతో స్పేస్‌ టూరిజం అభివృద్ధికి బాటలు పడుతున్నాయని తెలిపారు. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులు, స్మార్ట్‌ తయారీ ప్రక్రియలలో ఇస్రో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నారు. శాటిలైట్‌ టెక్నాలజీని తిరిగి తీసుకురావడం, విజయవంతంగా పరీక్షించబడిన ఇంజన్‌ తయారీలో ఉపయోగించే ప్రొపల్షన్‌ సిస్టమ్‌లు, గ్రీన్‌ – హైబ్రిడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌, న్యూక్లియర్‌ ప్రొపల్షన్‌, సంకలిత సాంకేతికతలతో కూడిన చిన్న రాకెట్ల ప్రయోగం వంటి కొన్ని రంగాలలో స్టార్టప్‌లతో కలిసి ఇస్రో పని చేస్తున్నదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement