అంకుర సంస్థలకు భారత్ అంతర్జాతీయ వేదికగా మారుతోంది. 2016లో కేవలం 471 సార్టప్ సంస్థలే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 72,993కు చేరింది. జూన్ 30నాటికి ఈ గణాంకాలు నమోదయ్యాయి. ఏ దేశానికైనా సాంకేతికత, పర్యావరణ అనుకూల విధానాలు అభివృద్ధికి దోహదపడతాయని, అందులో భాగంగానే స్టార్టప్‌లకు కేంద్రప్రభుత్వం సానుకూల విధానాలతో ప్రోత్సహిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ చెప్పారు. కేంద్రప్రభుత్వం గుర్తించిన స్టార్టప్‌లకు సంబంధించిన గణాంకాలు ఇవి. ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలని కేంద్రప్రభుత్వం అంకుర సంస్థల ప్రతిపాదనను 2016లో ముందుకు తీసుకువచ్చింది. దేశ ఆర్థికవృద్ధికి స్టార్టప్‌ల సంస్కృతి దోహదపడుతుందన్నది ప్రభుత్వం ఆలోచన. పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ సృజనకు పదునుపెట్టడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని కేంద్రప్రభుత్వం అప్పట్లో భావించింది. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం చెబుతూ ఈ వివరాలను లిఖితపూర్వకంగా మంత్రి వివరించారు.
డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) 56 విభిన్న రంగాల్లో స్టార్టప్‌లు ప్రారంభమైనట్లు గుర్తించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, అనలైటిక్స్ తదితర రంగాలకు సంబంధించి 4500 స్టార్టప్‌లు పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) నేషనల్ ఇనీషియేటివ్ ఫర్ డెవలపింగ్ ,హర్నెసింగ్ ఇన్నోవేషన్స్ (నిధి) పథకం కింద 2016లో స్టార్టప్ విధానాన్ని ప్రారంభించింది. స్టార్టప్‌ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లు అందించింది. వీరికోసం ప్రయాస్ (ప్రమోటింగ్ అండ్ యాక్సిలరేటింగ్ యంగ్ అండ్ యాస్పైరింగ్ ఇన్నోవేటర్స్ అంట్ స్టార్టప్స్) పథకాన్ని ప్రకటించి ఆర్థిక సహాయాన్ని అందించింది. ప్రధానంగా బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలకు, పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.