ఐపీఎల్ 14వ సీజన్ వాయిదాపడిన విషయం తెలిసిందే.లీగ్ వాయిదా నిర్ణయాన్ని ఐపీఎల్ ప్రసారదారు స్టార్‌స్పోర్ట్స్ సమర్థించింది. ఒకవేళ లీగ్‌ను నిర్వహించలేకపోతే బీసీసీఐకి రూ.2,500 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ టోర్నీ వాయిదా వల్ల స్టార్ స్పోర్ట్స్ నుంచి వచ్చే ఆదాయాన్ని బీసీసీఐ కోల్పోతుంది. మరోవైపు స్పాన్సర్లు, అడ్వటైజర్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో స్టార్‌స్పోర్ట్స్ స్పందించింది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లకు మాత్రమే డబ్బులు చెల్లించాలని స్పాన్సర్లు, ప్రకటనకర్తలను కోరింది.
వాయిదా పడిన ఐపీఎల్ 2021ను బీసీసీఐ తిరిగి నిర్వహిస్తే ప్రకటనకర్తలు వారి ప్రకటన ఒప్పందాల నుంచి వైదొలిగే వెసులుబాటు కూడా ఉంటుంది. ఐపీఎల్ 2021 కోసం వివిధ కేటగిరీల్లో 18 స్పాన్సర్లు ఉండగా, మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌కు 14 మంది స్పాన్సర్లు ఉన్నారు. టోర్నీ నిరవధికంగా వాయిదా పడటంతో తాము తీవ్రంగా నష్టపోయినట్లు అడ్వటైజర్లు ప్రకటించాయి. ప్రస్తుత సీజన్లో మే 30 వరకు అంటే 52 రోజుల పాటు 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. వాయిదా కారణంగా కేవలం 29 మ్యాచ్‌లు జరిగాయి. స్టార్‌స్పోర్ట్స్ 2018-2022 వరకు ఐపీఎల్ టెలివిజన్, డిజిటల్ ప్రసార హక్కులను రూ.16,348కోట్లకు దక్కించుకుంది. సీజన్లో మొత్తం 60 మ్యాచ్‌లు ఉండగా ఒక్కో మ్యాచ్‌కు 54.5కోట్లను బీసీసీఐకి చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 29 మ్యాచ్‌లకు స్టార్ స్పోర్ట్స్ దాదాపు రూ.1,580 కోట్లు చెల్లించాలి.