దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇవాళ అయితే ఏకంగా 2 లక్షల కేసులు వెలుగులోకి వచ్చాయి. మన దేశంలో ఇలా 2 లక్షల కేసులు రావడం ఇదే తొలిసారి. అసలు మునుముందు ఇంకెన్ని కేసులు పెరుగుతాయో తెలియడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాలలో కరోనా జోరుమీదుంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోవడంతో ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడింది. కరోనా ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితి లేదని, మరో 6 వారాల పాటు ఉద్ధృతి కొనసాగవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఢిల్లీ, ముంబైలలో ఫైవ్ స్టార్ హోటళ్లను తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చారు. దీనివల్ల ఎక్కువ మంది కరోనా పేషెంట్లకు చికిత్స అందించే అవకాశం ఏర్పడుతుంది. పరిస్థితి విషమంగా ఉన్న పేషెంట్లకు మాత్రం ఆసుపత్రుల్లోనే చికిత్స అందిస్తారు. తక్కువ కరోనా లక్షణాలు ఉన్న పేషెంట్లను మాత్రం స్టార్ హోటల్స్ కు తరలిస్తారు. ఇక్కడ 24 గంటల పాటు వైద్యులు, వైద్య సిబ్బంది, ఔషధాలు, అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి. ముంబైలో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే వారికి రోజుకు రూ. 4 వేలు ఛార్జ్ చేస్తారు. పేషెంట్ కు తోడుగా ఉండాలనుకునేవారు మరో గది కావాలనుకుంటే రోజుకు రూ. 6 వేలు చెల్లించాల్సి ఉంటుంది.