హైదరాబాద్ / అమరావతి – మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎపి, తెలంగాణ ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో ప్రాణాల కోల్పోయిన వారికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు , తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఎక్స్ వేదికగా సీఎం స్పందిస్తూ మహాకుంభమేళా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ క్లిష్ట సమయంలో మనోధైర్యం కోల్పోకుండా వారికి ఓదార్పు కల్పించాలని కోరుకుంటున్నాను అంటూ ఎక్స్ వేదికగా చంద్రబాబు పోస్టు చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని, గాయపడినవారికి సరైన వైద్యం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
మహా కుంభమేళాలో తొక్కిసలాట దురదృష్టకరం – పవన్ కల్యాణ్
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 20 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని తెలిపారు ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ . దురదృష్టకరమైన ఘటన ఇది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించాలని కోట్ల మంది వచ్చిన క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోవడం బాధాకరం. మన తెలుగు రాష్ట్రాల నుంచి మహా కుంభమేళాకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ప్రభుత్వ అధికారుల సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నానని ట్విట్ చేశారు. ఇక తెలంగాణకు చెందిన మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్ రావులు ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.